బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రానున్న కొత్త మూవీ కథను సైడ్ చేశారు. అయితే, మరో కథతో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఈ మూవీ రానుంది. మొదట హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా మేకర్స్ అనుకున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్ అయినా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్ కిలారు పూనుకున్నారు. అందుకోసం నయనతారను హీరోయిన్‌గా రంగంలోకి దింపారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి.
ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్నట్లు మేకర్స్ గతంలోనే చెప్పారు. ఆపై విజువల్ వండర్‌గా గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. కానీ, సడెన్‌గా నిర్మాత, హీరో, దర్శకుడు అంతా కలిసి మనసు మార్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సైడ్ చేసి మరో కథతో షూటింగ్ ప్రారంభించాలని వారు డిసైడ్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది.
ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా నిర్మించాలంటే భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. కనీసం రూ. 150 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని టాక్.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి అంత మెరుగ్గాలేదు. పైగా అఖండ-2ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసినా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆపై ఓటీటీ ఆదాయం కూడా పెద్దగా లేదు. బాలయ్య మార్కెట్ ప్రకారం అంత బడ్జెట్ వర్కౌట్ కాదని తెలిసి మరో కథతో సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.


