భారతీయ సినిమా ప్రయాణంలో ఇది కీలక ఘట్టం: నాగార్జున | SS Rajamouli unveils India most advanced Motion Capture Lab at Annapurna Studios | Sakshi
Sakshi News home page

భారతీయ సినిమా ప్రయాణంలో ఇది కీలక ఘట్టం: నాగార్జున

Feb 26 2026 12:03 AM | Updated on Feb 26 2026 12:04 AM

SS Rajamouli unveils India most advanced Motion Capture Lab at Annapurna Studios

‘‘ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనుకునే భారతీయ దర్శకుల కలలకు అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఆ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్‌ అడ్వెంచర్‌ నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు. భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టం’’ అని నాగార్జున అన్నారు. ‘అవతార్, అవెంజర్స్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాల మేకింగ్‌లో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని ఉపయోగించారు ఆ చిత్రాల ఫిల్మ్‌ మేకర్స్‌. 

ఈ టెక్నాలజీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుబాటులోకి వచ్చింది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, శోభు యార్లగడ్డ మిహిరా విజువల్‌ ల్యాబ్స్‌ కలిసి ‘ఎ అండ్‌ ఎమ్‌ మోక్యాప్‌ ల్యాబ్‌’ ను స్టార్ట్‌ చేశారు. ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్, స్పైడర్‌ మేన్‌: నో వే హోమ్‌’ వంటి చిత్రాలకు వర్క్‌ చేసిన యానిమాట్రిక్‌ ఫిల్మ్‌ డిజైన్‌ కంపెనీ భాగస్వామ్యమైంది. 

మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ను లాంచ్‌ చేసిన అనంతరం రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఎ అండ్‌ ఎమ్‌’ సంస్థ అద్భుతమైన టెక్నాలజీని అందిస్తుంది. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణలో ఈ టెక్నాలజీని వినియోగించి, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం... అద్భుతంగా వచ్చాయి. అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థలకు భారత్‌ నుంచి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వర్క్‌ చేయడానికి వెళ్తున్నారు.

అయితే ఆ ఆధునాతన సౌకర్యాలు మాత్రం మనకు అందుబాటులో ఉండటం లేదు. ‘ఈగ, ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల చిత్రీకరణ అప్పుడు ఇండియాలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే... ఈ సినిమాలను ఇంకా బాగా ఎలా చేయవచ్చు? అని ఆలోచించేవాడిని. ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ వారి ఆలోచనా ధోరణిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లవచ్చు’’ అని చెప్పారు. ‘‘మిహిరా ల్యాబ్స్‌ లక్ష్యం ఎప్పుడూ ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్లకు అంతర్జాతీయ ప్రమాణాల టూల్స్‌ అందించడమే’’ అన్నారు శోభు యార్లగడ్డ.

‘‘ఈ టెక్నాలజీ సదుపాయంతో వర్చ్యువల్‌ ఎన్విరాన్‌మెంట్‌లో కెమెరా బ్లాకింగ్, లెన్స్‌ ఎంపిక, కెమెరా మూవ్‌మెంట్స్, ఫ్రేమ్‌ రేట్స్‌ వంటి అంశాలను ముందుగానే పరీక్షించవచ్చు. దీనివల్ల టెక్నికల్, లాజిస్టి కల్‌ అవసరాలను ముందే అంచనా వేసి, లైవ్‌ షూట్‌లో సమయం, ఖర్చును తగ్గించుకోవచ్చు’’ అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్‌ సీటీవో సీవీ రావు. ‘‘భారతీయ కథలు ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికతతో మరింత గొప్పగా రూపుదిద్దుకోనున్నాయి’’ అని చెప్పారు యానిమాట్రిక్‌ ఫిల్మ్‌ డిజైన్‌ అధ్యక్షుడు అండ్‌ సీటీఓ బ్రెట్‌ ఇన్‌సన్‌. భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాల లెగసీని పూర్తి చేసిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ని ప్రారంభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement