ప్రైవేటు మూలధన నిధులను ప్రోత్సహించాలి
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు
ప్రపంచ బ్యాంక్ నివేదిక సూచన
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సంస్కరణలకు మరింత ప్రేరణనివ్వాలని, ప్రైవేటు మూలధన నిధుల సమీకరణకు ఊతమివ్వాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా సదుపాయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసినట్టు తాజా నివేదిక (ఆర్థిక రంగ మదింపు/ఎఫ్‌ఎస్‌ఏ) లో పేర్కొంది.
ఇకపై మహిళలు తమ బ్యాంక్ ఖాతాలను మరింతగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యక్తులు, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో కలసి ప్రపంచ బ్యాంక్ దేశాల ఆర్థిక రంగాన్ని లోతుగా, సమగ్రంగా విశ్లేíÙంచి ఎఫ్‌ఎస్‌ఏ నివేదికను విడుదల చేస్తుంటుంది. ఈ నివేదికను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా, వైవిధ్యంగా, సమ్మిళితంగా మారినట్టు ప్రపంచ బ్యాంక్ ఎఫ్‌ఎస్‌ఏ నివేదిక తెలిపింది. ఆర్థిక రంగ సంస్కరణల ఫలితంగా భారత్ కరోనా సహా పలు సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగలిగినట్టు పేర్కొంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా మరిన్ని ఆర్థిక రంగ సంస్కరణలతో ప్రైవేటు మూలధన పెట్టుబడులకు ఊతమివ్వాలని సూచించింది.
మెరుగైన నియంత్రణలు..
సహకార బ్యాంకులకు సైతం నియంత్రణలను విస్తరించడం వాటి సమర్థతను పెంచుతుందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలకు వాటి స్థాయిల ఆధారంగా నియంత్రణలను అమలు చేయడాన్ని సైతం ఆహ్వానించింది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి మరింత మెరుగైన పర్యవేక్షణకు వీలుగా క్రెడిట్ రిస్క్ నిర్వహణ కార్యాచరణను బలోపేతం చేయాలని సూచించింది. 2017లో చివరి ఎఫ్‌ఎస్‌ఏ నివేదిక నుంచి చూస్తే భారత జీడీపీలో క్యాపిటల్ మార్కెట్ల పరిమాణం 144 శాతం నుంచి 175 శాతానికి విస్తరించినట్టు తెలిపింది.


