
అభిప్రాయం
వస్తు సేవల పన్ను మండలి (జీఎస్‌టీ కౌన్సిల్) 56వ సమావేశం ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థలో ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు దేశ పరోక్ష పన్ను వ్యవస్థ పరిణామ క్రమంలో ఓ కీలక ఘట్టం. ఈ సంస్కరణల అమలు ప్రధానంగా మూడు పరస్పర అనుసంధానిత మూల స్తంభాలు – ‘సమూల సంస్కరణ, పన్ను హేతుబద్ధీకరణ, చెల్లింపుదారుల జీవన సౌలభ్యం’పై ఆధారపడి ఉంటుంది.
సమూల సంస్కరణల్లో భాగంగా – పన్ను విధింపులో అనిశ్చితి తగ్గింపు ధ్యేయంగా పన్ను శాతాల సంఖ్య కుదింపుపై సునిశిత శ్రద్ధ చూపారు. సామాన్యుల దైనందిన అవసరాలకు ఉపయోగపడే కొన్ని వస్తువులపై స్వల్ప ‘మెరిట్’ శాతంలోనూ– ‘హానికర’ (సిన్ ), విలాస స్వభావం గల వస్తువులపై అధిక ‘ప్రత్యేక’ శాతంలోనూ పన్ను విధించాలని నిర్ణయించారు.
వస్తు, సేవల వర్గీకరణ, పన్నుశాతాలపై అభ్యంతరాలు, వివాదాలకు సంబంధించి అధికశాతం ఆహార, ఆటోమొబైల్ విడిభాగాల రంగాల్లోనే తలెత్తినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. మార్కెట్‌లో ఆహారోత్పత్తుల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్న ఫలితంగా వాటి వర్గీకరణ సమస్యా త్మకమైంది. అలాగే పన్ను శ్లాబుల నిర్ణయం కూడా!
ప్రస్తుత సంస్కరణల్లో ఆహార రంగాన్ని ఒకే పన్ను శాతం కిందకు తేవడం ద్వారా గందరగోళం తొలగించారు. అలాగే ఆటోమోటివ్ రంగంలో కూడా... ముఖ్యంగా వాహన విడి భాగాలపై ఏకరూప పన్ను విధింపుపై తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనం ఇవ్వడంతోపాటు పరిశ్రమలో విశ్వాసం ఇనుమడించి, వివాదాలకు ముగింపు పలుకుతుంది.
జీఎస్‌టీ వ్యవస్థలో విలోమ సుంకం పద్ధతి (ఇన్ వర్టెడ్ టాక్స్ సిస్టమ్–ఐడీఎస్) నిరంతర సమస్యాత్మకంగా మారింది. దీనికింద వస్తు తయారీ ముడిసామగ్రిపై విధించే పన్ను, తయారైన వస్తువుపై విధించే పన్ను కన్నా ఎక్కువగా ఉంటుంది. పర్యవసానంగా ‘ముడి సామగ్రిపై పన్ను వాపసు’ (ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్–ఐటీసీ) మొత్తం పేరుకుపోతూ ఉంటుంది.
పారిశ్రామిక రంగంలోని అనేక విభాగాలలో ముడి సామగ్రి వినియోగ స్వభావం కలిగి ఉంటుంది. వాటిపై సరైన రీతిలో విలోమ శాతం పన్ను విధించడంలో కొంత సంక్లిష్టత ఉంటుంది. అయితే, ఇప్పుడు వీలైన ప్రతి సందర్భానికీ తగినట్లు... ముఖ్యంగా ఎరువుల పరిశ్రమలో ముడి పదార్థం ప్రధానంగా ఒకే తరహా ఉత్పత్తికి ఉపయోగపడుతుంది కాబట్టి, విలోమ పన్ను విధింపు పద్ధతిని సరిదిద్దారు.
‘ఎంఎస్‌ఎంఈ’లు ఎక్కువగా ఉన్న రంగాల్లో ‘ఐడీఎస్’ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు దేశంలో 4.5 కోట్ల మందికిపైగా ఉపాధి పొందే వస్త్ర పరిశ్రమకు సంబంధించి చేతితో వడికిన–నేసిన ఉత్పత్తుల నుంచి భారీ మిల్లుల ఉత్పత్తుల మధ్య వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి స్వభావం ప్రకారం దుస్తులపై సుంకం 5 శాతం వంతున... సుంకం ‘మెరిట్’ రేటుకు లోబడి ఉంటుంది.
ఇక్కడ వస్త్ర రంగంలోని సహజ నూలు విభాగంలో విలోమం లేకపోయినా, మానవ శ్రమతో తయారైన వస్త్ర విభాగంలో ఉంటుంది. అయితే, రాబడి పరంగా చిక్కుల వల్ల వీటి మొత్తం విలువ శ్రేణిలో విలోమాన్ని సరిదిద్దడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ, ఈ వ్యత్యాసం ‘ఎంఎస్‌ఎంఈ’లపై అనవసర భారం పడని రీతిలో ఉండేవిధంగా జాగ్రత్త వహించారు.
తాజా సంస్కరణల ప్రక్రియను సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే కసరత్తుగా తొలుత భావించారు. దీని ప్రకారం– జనసామాన్యం వాడే వస్తువులతో విలాసవంతమై నవిగా పరిగణించే కొన్ని వస్తువు లపై పన్నును ‘మెరిట్’ శాతానికి తగ్గించారు. తద్వారా విస్తృత జనాభా కొనుగోలు శక్తి పెరుగు తుంది కాబట్టి, డిమాండ్ కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ సూత్రాలన్నీ కలిసి పన్ను శాతాల క్రమబద్ధీకరణ కసరత్తు హేతుబద్ధ తకు రూపమిచ్చాయి.
రాష్ట్రాలకు 2022 జూలై తర్వాత పరిహార సుంకం వసూ ళ్లలో వాటా చేరడం లేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో వసూళ్ల లోటు తగ్గించే దిశగా అవి తీసు కున్న రుణానికి దీన్ని జమ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ చెల్లింపులన్నీ దాదాపు పూర్తయ్యాయి కాబట్టి, కేంద్రంతోపాటు రాష్ట్రాలకూ ‘జీఎస్‌టీ’ వసూళ్లు పెరిగేందుకు తగిన ఆర్థిక వెసులు బాటు లభిస్తుంది.
జీఎస్‌టీ వ్యవస్థతో పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ప్రతి దశలోనూ సరళీకరించే మార్గదర్శక సూత్రం ఈ సంస్కరణలకు మూడో మూలస్తంభం. తదనుగుణంగా వ్యాపారాల రిజిస్ట్రేషన్, పన్ను వాపసుల అంశాన్ని ఇవి లక్ష్యం చేసుకుంటాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు విధానపరమైన ఇబ్బందుల తగ్గడంతోపాటు నిర్వ హణ మూలధన సమీకరణలో అడ్డంకులు తొలగుతాయి.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పటికే ఎదిగింది. ఇక ప్రస్తుత సంస్కరణల ద్వారా దేశీయ డిమాండ్ దృఢం కావడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతుంది. ‘స్వయం సమృద్ధ భారత్’ స్వప్న సాకారం దిశగా విస్తృత జాతీయ దృక్కోణం బలపడేందుకు ఈ సంస్కరణలు ప్రధానంగా తోడ్పడతాయి.
సంజయ్‌కుమార్ అగ్రవాల్
వ్యాసకర్త కేంద్రీయ ప్రత్యక్ష పన్నులు–సుంకాల బోర్డు చైర్మన్