
జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు తప్పకుండా అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. దీనివల్ల దేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.
'‘జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతోపాటు, పన్నుల నిర్మాణాన్ని సులభతరం చేయడం వల్ల దేశీ డిమాండ్‌కు ఊతం లభిస్తుంది. చిన్న, పెద్ద స్థాయి కంపెనీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఇది అధిక వ్యయాలకు దారితీస్తుంది'' అని మంత్రి వివరించారు. మౌలిక వసతుల కల్పనకుతోడు, బలమైన వినియోగ డిమాండ్ కలిగిన భారత్ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని.. ఈఈపీసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో నిరుద్యోగ రేటు ఇలా..
4 లక్షల ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2–2.5 ఏళ్లలో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశీ డిమాండ్‌కు ప్రధాని ఊతమిచ్చినట్టు చెప్పారు. సంక్షోభం నుంచి బలపడే శక్తి భారత్‌కు ఉందంటూ, దేశీ ఉత్పత్తులపై వ్యాపారాలు దృష్టి సారించాలని కోరారు. ఇది దేశ వృద్ధికి సాయపడుతుందని, దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందన్నారు.