వాణిజ్య మంత్రి గోయల్ సన్నాహాలు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు, విదేశీ సంస్థాగత పెట్టుబడు(ఎఫ్‌ఐఐ)లను ఆకట్టుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళతర, సమర్థవంత వేగంతోకూడిన విధానాలకు తెరతీయనున్నారు.
ఈ బాటలో ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ విధానాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. తద్వారా దేశంలోకి మరింత వేగంగా పటిష్టస్థాయిలో పెట్టుబడులు ప్రవహించేలా గోయల్ చర్యలు చేపట్టనున్నారు. సమావేశానికిముందు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 98వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులనుద్ధేశించి గోయల్ ప్రసంగించారు.
దేశంలోకి మరింత వేగంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు గోయల్ తెలియజేశారు. ఉద్యోగ కల్పన, కొత్త టెక్నాలజీలు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు దారి చూపుతాయని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశీ కరెన్సీకి స్థిరత్వాన్ని కలి్పంచవచ్చని తెలియజేశారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
క్యూ1లో 15 శాతం అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో దేశంలోకి 15 శాతం అధికంగా ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లను అధిగమించగా.. ఎఫ్‌డీఐలు 80.6 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! పారిశ్రామికంగా సరఫరా వ్యవస్థలు డైవర్సిఫైకావలసి ఉన్నట్లు గోయల్ ప్రస్తావించారు. దీంతో ఒకే ప్రాంతంపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు.


