వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి ఆస్కారం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. వినియోగ వస్తువులు, ఆహారోత్పత్తులు, వాహనాలు, ట్రాక్టర్లు, భారీ వాణిజ్య వాహనాలు, స్మార్ట్‌ఫోన్స్ లాంటి ఎల్రక్టానిక్స్ మొదలైన విభాగాల్లో అవకాశాలు ఉన్నాయని ఇరు దేశాల వ్యాపార వర్గాలతో భేటీలో ఆయన పేర్కొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం 70 బిలియన్ డాలర్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. అమెరికా భారీ టారిఫ్‌లను భారత్, పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వాణిజ్య అసమానతలను తొలగించుకునే దిశగా కలిసి పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
2024–25లో రష్యాకు భారత్ ఎగుమతులు 4.96 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 63.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023–24లో 56.89 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 59 బిలియన్ డాలర్లకు చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. భారత పర్యటనకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బృంద సభ్యుడు, ప్రెసిడెన్షియల్ ఆఫీస్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మ్యాక్సిమ్ ఒరెష్కిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత్ నుంచి ఫార్మా, వ్యవసాయం, టెలికం పరికరాల్లాంటి ఆరు విభాగాల్లో ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు సున్నితంగా మారిన తరుణంలో భారత్‌లో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.


