 
													విశ్లేషణ
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. 
ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. 
‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. 
కాచుకుని ఉన్న అమెరికా
విస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్‌లోకి అడుగు  పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. 
అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. 
జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్‌ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. 
కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. 
మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ  తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. 
చౌక దిగుమతులతో రైతులకు నష్టం
పప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. 
దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. 
వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధర
రూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. 
ఒత్తిళ్లకు లొంగకూడదు!
కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. 
అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
