సైబర్‌సెక్యూరిటీ, మెడికల్ డివైస్‌లపై దృష్టి
వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్
టెల్‌అవీవ్: భారత్, ఇజ్రాయెల్ స్టార్టప్‌లు సాంకేతిక సహకారమందించుకునేందుకు చేతులు కలపవలసి ఉన్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా సైబర్‌సెక్యూరిటీ, మెడికల్ పరికరాలు తదితరాలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహకారానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.
సొంత స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇజ్రాయెల్‌తో చేతులు కలపనున్నట్లు పేర్కొన్నారు. పోటీ ధరలలో లోతైన టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన ఆవిష్కరణలను అందించే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. భారత్‌కున్న విస్తారిత వ్యవస్థల ద్వారా ఇందుకు పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్ వాణిజ్య మంత్రి నిర్ బార్కట్‌తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు గోయల్ ఇక్కడకు వచ్చారు.


