ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటానికి ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ (TIA) పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండే వాణిజ్య డేటాతో వ్యాపారం మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పారు. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) కోసం ఈ పోర్టల్ సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.
చిన్న వ్యాపారాలకు అవకాశం
పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉన్న డేటాను చిన్న వ్యాపారాలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారికి యాక్సెస్ కల్పించడమే టీఐఏ పోర్టల్ ముఖ్య లక్ష్యం అన్నారు. భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTA) మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఎగుమతిదారులకు ఈ వేదిక సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ సుంకాల పరిస్థితిని వేకప్‌కాల్‌గా అభివర్ణించిన గోయల్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగం వనరులను సమీకరించాలని పిలుపునిచ్చారు.
వాటాదారుల డిమాండ్లకు హామీ
ఈ సందర్భంగా వాటాదారులు తమ డిమాండ్లను తెలియజేయాలని తెలిపారు. వాటిని పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. వాటాదారులు తీసుకొచ్చిన సమస్యలు వాణిజ్య విభాగానికి సంబంధించినవి అయితే త్వరగా పరిష్కరించబడుతాయన్నారు. ఇతర విభాగాలకు సంబంధించినవి అయితే వాణిజ్య శాఖ చురుకుగా సమన్వయం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని గుర్తించిన వాణిజ్య శాఖ మార్చి 2024లో TIA పోర్టల్ అభివృద్ధిని ప్రారంభించింది. ఈ పోర్టల్ 28 డ్యాష్‌బోర్డ్‌ల్లో 270 కంటే ఎక్కువ ఇంటరాక్టివ్ విజువలైజేషన్లను అందిస్తుంది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ మానిటరింగ్ డ్యాష్‌బోర్డ్, నిర్యాత్ పోర్టల్, ట్రేడ్‌స్టాట్ పోర్టల్ వంటి పాత వాణిజ్య సమాచార పోర్టల్‌ల స్థానంలో దశలవారీగా అప్‌డేట్ అవుతుంది.
ఇదీ చదవండి: డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..


