విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 26తో ముగిసిన వారంలో 3.29 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో మొత్తం విదేశీ మారకం నిల్వలు 696.61 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ అంతకు ముందు వారంలో విదేశీ మారకం నిల్వలు 4.36 బిలియన్ డాలర్లు పెరిగి 693.31 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
డిసెంబర్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో నిల్వలు (మొత్తం నిల్వల్లో అధిక భాగం) 184 మిలియన్ డాలర్లు పెరిగి 559.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఎస్ డాలర్లతోపాటు యూరో, పౌండ్, యెన్ తదితర రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. అయినప్పటికీ వీటి విలువను యూఎస్ డాలర్ల రూపంలో ప్రకటిస్తుంటారు.
బంగారం నిల్వల విలువ 2.95 బిలియన్ డాలర్లు పెరిగి 113.32 బిలియన్ డాలర్లకు చేరింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ 60 మిలియన్ డాలర్లు పెరిగి 18.80 బిలియన్ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు 93 మిలియన్ డాలర్ల వృద్ధితో 4.87 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.


