బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజులుగా కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో బంగారం ధరలు తగ్గుతాయా.. కొనగలమా అని సామాన్య కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎమ్‌కే వెల్త్ మేనేజ్ మెంట్ (Emkay Wealth) బంగారం ధరలకు సంబంధించి కీలక అంచనాలు వెల్లడించింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్పులు, సంస్థాగత డిమాండ్ బంగారాన్ని “సురక్షిత స్వర్గధామ” ఆస్తిగా మరింత బలపరిచాయి. ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రకారం.. బంగారం ప్రస్తుతం దృఢమైన సాంకేతిక పునాదిలో ఉంది. సంస్థ అప్‌సైడ్ లక్ష్యాలను ఔన్స్‌కు 4,368 డాలర్ల నుంచి 4,600 డాలర్లుగా, అలాగే మద్దతు స్థాయిలను 3,890 డాలర్ల నుంచి 3,510 డాలర్ల వద్దగా నిర్దేశించింది.
కాగా ప్రస్తుతం (12 నవంబర్ 2025 నాటికి) బంగారం ఔన్స్ ధర సుమారు 4,100 డాలర్ల వద్ద ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,510 లుగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,15,050 లుగా కొనసాగుతోంది.
బంగారం పెరుగుదలకు ప్రాధాన కారణాలు
డాలర్ బలహీనత: గత సంవత్సరం యూఎస్ డాలర్ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 8% క్షీణించడం వల్ల, డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో ఉన్న పెట్టుబడిదారులకు బంగారం సాపేక్షంగా చౌకగా మారింది.
ద్రవ్యోల్బణ అనిశ్చితి: అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమతుల్యత భయాలు బంగారాన్ని ద్రవ్యోల్బణ కవచంగా బలపరిచాయి.
సెంట్రల్ బ్యాంక్ డైవర్సిఫికేషన్: డాలర్‌పై ఆధారాన్ని తగ్గించే క్రమంలో, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.
ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు: 2025లో రికార్డు స్థాయి 65 బిలియన్ డాలర్ల మేర ఈటీఎఫ్‌ల ప్రవాహాలు బంగారంపై రిటైల్, సంస్థాగత విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
భౌగోళిక రాజకీయ అస్థిరత: తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత-స్వర్గధామ ఆస్తులపై డిమాండ్‌ను నిలబెట్టాయి.


