దేశీయంగా నవంబర్ ఐఐపీ విడుదల
గత నెల వాహన విక్రయ వివరాలు
డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో ముగింపు
యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ రిలీజ్
నిరుద్యోగం, వాణిజ్య వివరాలు సైతం
దేశీ స్టాక్ మార్కెట్లకు ఈ వారం దేశ, విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజు యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్ల యాక్టివిటీ తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక ఆటుపోట్లకు అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం
ఈ వారం భారత్‌సహా యూఎస్, చైనా ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(29న) గత నెల(నవంబర్)కు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం పుంజుకుంది. 30న ఎన్‌ఎస్‌ఈ డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. 31న నవంబర్ చివరికి బడ్జెట్ లోటు వివరాలు వెల్లడికానున్నాయి. కొత్త ఏడాది తొలి రోజు వాహన విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి 2న డిసెంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ ఇండెక్స్, విదేశీ మారక నిల్వల స్థితి డేటా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురికావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా..
అంతర్జాతీయంగా చూస్తే డిసెంబర్ నెలకు చైనా తయారీ, తయారీయేతర పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. యూఎస్ తయారీ ఇండెక్స్‌తోపాటు.. అక్టోబర్ నెలకు వాణిజ్య ముందస్తు అంచనాలు విడుదలకానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా సమావేశ వివరాలు(మినిట్స్) 31న వెల్లడికానున్నాయి. చివరి వారానికి నిరుద్యోగ క్లెయిమ్‌ల గణాంకాలు వెల్లడికానున్నాయి.
ఇతర అంశాల ఎఫెక్ట్
→ ఈ కేలండర్ ఏడాది ముగియడానికి 3 రోజులే గడువున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) లావాదేవీలు మందగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
→ డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో కొత్త సిరీస్(2026 జనవరి)కు జరిగే రోలోవర్లకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఈ వారం సైతం ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.
అంచనాలు అందుకున్నప్పటికీ
నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు టెక్నికల్ అంశాలు అంచనా వేసినట్లు బ్రేకవుట్ సాధించినప్పటికీ తిరిగి డీలా పడ్డాయి. అయితే చివరికి స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం! వెరసి బీఎస్‌ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు పుంజుకుని 85,041 వద్ద నిలవగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 26,042 వద్ద స్థిరపడింది.
బుల్లిష్ ధోరణిలోనే..
రెండు వారాల నష్టాల ధోరణికి అడ్డుకట్టవేస్తూ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ వారం సైతం హెచ్చుతగ్గుల మధ్య బలాన్ని పుంజుకునేందుకే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.
→ గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,060 పాయింట్లను దాటి 26,236కు ఎగసింది. వెరసి ఈ వారం నిఫ్టీకి 25,920– 25,800 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిల నుంచి పుంజుకునేందుకు వీలుంది. ఇలా జోరందుకుంటే 26,450 పాయింట్లవరకూ బలపడే అవకాశముంది. స్వల్ప కాలంలో 27,000 పాయింట్లస్థాయికి చేరడానికీ వీలుంది.
→ గత వారం అంచనాలకు అనుగుణంగా సెన్సెక్స్ 85,350 పాయింట్లను దాటి 85,738కు ఎగసింది. వెరసి ఈ వారం 84,600– 84,200 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించవచ్చు. ఇక్కడినుంచి బలపడితే.. 85,800, 86,200 పాయింట్ల గరిష్టాలను తాకవచ్చు. ఈ బాటలో సమీప కాలంలో 87,000 పాయింట్ల మైలురాయికి చేరే అవకాశముంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్


