బడ్జెట్, ఫెడ్‌ పైనే ఫోకస్‌ | Union Budget 2026 to US Fed meet, Q3 results may dictate Indian stock market this week | Sakshi
Sakshi News home page

బడ్జెట్, ఫెడ్‌ పైనే ఫోకస్‌

Jan 26 2026 4:22 AM | Updated on Jan 26 2026 4:22 AM

Union Budget 2026 to US Fed meet, Q3 results may dictate Indian stock market this week

డెరివేటివ్స్‌ ముగింపు కీలకం 

27న, 29న ఆటుపోట్లకు చాన్స్‌ 

28న ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు 

ఫిబ్రవరి 1న బడ్జెట్‌– స్టాక్స్‌లో ట్రేడింగ్‌ 

నేడు స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు 

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై అంచనాలు

వచ్చే నెల తొలి రోజున కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌కు తెరతీయనుంది. మరోపక్క బుధవారం(28న) యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సమీక్ష  చేపట్టనుంది. ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతోపాటు ఫిబ్రవరి సిరీస్‌ ప్రారంభంకానుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

రిపబ్లిక్‌ డే సందర్భంగా నేడు(26న) స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ఆదివారం(ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదివారం సైతం స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ట్రేడింగ్‌కు వీలు కల్పిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో జనవరి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు రేపు(27న) ముగియనుంది. బీఎస్‌ఈలో వీటి ఎక్స్‌ పైరీ గురువారం(29న)కాగా.. రెండు ఎక్సే్ఛంజీలలోనూ ఫిబ్రవరి సిరీస్‌ ప్రారంభంకానుంది.  కాగా.. యూరోపియన్‌ యూనియన్‌– భారత్‌ మధ్య వాణిజ్య డీల్‌ కుదిరితే ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించే వీలుంది. 

వడ్డీ తగ్గించేనా? 
కొత్త ఏడాదిలో రెండురోజులపాటు నిర్వహిస్తున్న తొలి పాలసీ సమీక్షా సమావేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని ఆ ర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ద్రవ్యోల్బణం, ఉపాధిసహా.. ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌పై రాజకీయంగా, లీగల్‌గా ఒత్తిడి కొనసాగుతుండటం ప్రభా వం చూపవచ్చని పేర్కొన్నారు. వెరసి ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.5–3.75 శాతంవద్దే కొనసాగే వీలుంది. గురువారం(29న) నవంబర్‌ నెలకు యూఎస్‌ వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో వాణి జ్య లోటు 29.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 

ఇతర దేశీ అంశాల ఎఫెక్ట్‌ 
→ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 36,591 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో రూపాయిపై సైతం ఒత్తిడి పడుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతు న్నారు. వెరసి డాలరుతో మారకంలో రూపాయి గత వారం 91.97కు పతనమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.  
→ 2025 డిసెంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు 28న విడుదలకానున్నాయి. నవంబర్‌లో ఐఐపీ 6.7 % ఎగసింది. 
→ మరిన్ని దిగ్గజాలు 2026 క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో యాక్సిస్‌ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఐటీసీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ తదితరాలున్నాయి.  

మరింత డీలా.. 
→ గత వారం సెంటిమెంటు బలహీనపడటంతో మార్కెట్లు పతన బాటలో సాగాయి. సెన్సెక్స్‌ 2,033 పాయింట్లు క్షీణించి 81,538 వద్ద నిలిచింది. నిఫ్టీ 646 పాయింట్లు పడిపోయి వద్ద 25,049 ముగిసింది. 
→ ఈ వారం సైతం అమ్మకాలతో మార్కెట్లు మరింత నీరసించవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అంచనాల ప్రకారం నిఫ్టీకి 24,300– 24,000 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభించవచ్చు. బలపడితే 25,400– 25,600 పాయింట్లకు చేరే వీలుంది. 
→ సెన్సెక్స్‌ 80,000– 79,500 పాయింట్ల స్థాయిలో మద్దతు అందుకునే వీలుంది. ఒకవేళ ఊపందుకుంటే 82,000–82,600 పాయింట్లవరకూ బలపడవచ్చు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement