ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే
25న క్రిస్మస్ సందర్భంగా సెలవు
మౌలిక రంగ గణాంకాలపై దృష్టి
యూఎస్ క్యూ3 జీడీపీకి ప్రాధాన్యం
సుమారు 3 వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు మద్దతు స్థాయిలనుంచి రికవర్ అవుతూ వస్తున్నాయి. తొలుత అమ్మకాలు.. తదుపరి కొనుగోళ్లతో నిఫ్టీ 26,000, సెన్సెక్స్ 85,000 పాయింట్లకు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు మరోసారి సైడ్‌వేస్‌లో కదలనున్నాయా లేక శాంటా ర్యాలీకి దారి ఏర్పడుతుందా చూడవలసి ఉంది!
క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మరోపక్క యూఎస్ సహా.. పలు యూరోపియన్ మార్కెట్లకు కొత్త ఏడాది సెలవులు సైతం జత కలవనుండటంతో దేశీయంగానూ ట్రేడింగ్ పరిమాణం నీరసించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆటు పోట్ల మధ్య మార్కెట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో కదులుతున్నాయి. దీంతో ఈ వారం కూడా హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నచందాన ట్రేడ్‌కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క ఇదే సమయంలో ఈ వారం శాంట క్లాజ్ ర్యాలీకి బీజం పడవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?
పరిశీలించదగ్గ అంశాలు
→ దేశీయంగా నేడు(22న) నవంబర్ నెలకు మౌలిక రంగ పురోగతి వివరాలు వెల్లడికానున్నాయి. 2025 అక్టోబర్‌లో దాదాపు యథాతథంగా 3.3 శాతం వృద్ధి నమోదైంది. 14 నెలల తదుపరి ఎలాంటి పురోగతి నమోదుకాకపోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్‌లు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.
→ డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టం 91 స్థాయి నుంచి భారీ రికవరీ సాధించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకపు విలువ వారాంతాన 89.67 వద్ద స్థిరపడింది.
→ దేశీ మార్కెట్లలో పటిష్ట లిక్విడిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు పలు ఐపీవోలతో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్లలో రిటైలర్లతోకలసి దేశీ ఫండ్స్ పెట్టుబడులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు.
విదేశీ ఎఫెక్ట్
→ ఈ వారం(23న) యూఎస్ మూడో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధిపై ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. క్యూ2(ఏప్రిల్–జూన్)లో యూఎస్ జీడీపీ వార్షికంగా 3.8%పుంజుకుంది. 3.3% అంచనాలను అధిగమించింది.
→ ఇదే రోజు యూఎస్ ప్రయివేట్ రంగ ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 24న నిరుద్యోగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి.
→ ద్రవ్యోల్బణం, ఉపాధి గణాంకాల ప్రభావంతో యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్ల కోత అమలు కు మొగ్గు చూపవచ్చని అంచనాలు పెరిగాయి.
సాంకేతిక అంచనాలు ఇలా
గత వారం అంతక్రితం వారంలాగే మార్కెట్లు రెండో సపోర్ట్ లెవల్స్‌వద్ద నుంచి రికవరీ సాధించాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వారం శాంట ర్యాలీకి తెరతీయవచ్చని అంచనా. నిఫ్టీ 26,060కు ఎగువన నిలదొక్కుకుంటే 26,450 వరకూ బలపడవచ్చు. 25,700 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. బలహీనపడి 25,600కు చేరితే మరింత నీరసించవచ్చు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


