2025 సిల్వర్‌నామ సంవత్సరం
వెండి@ రూ.2.36 లక్షలు
పుత్తడి కంటే వేగంగా పరుగులు
ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ధర..
ఏడాదిలో 154 శాతం పెరిగి కిలో రూ.2.36 లక్షలకు చేరిన వైనం
అదే సమయంలో 79 శాతం పెరిగిన పది గ్రాముల బంగారం
ఉత్పత్తి తగ్గడంతోపాటు పారిశ్రామిక డిమాండ్ పెరగడమే వెండి ర్యాలీకి కారణమంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి : మరో నాలుగు రోజుల్లో ముగియనున్న 2025 సిల్వర్‌నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది. మార్కెట్‌లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తళుకులు వెలవెలబోయేలా ఆకాశాన్నంటుతున్నాయి. నూతన గరిష్ట స్థాయిలకు చేరుకోవడమే కాకుండా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 154 శాతం పైగా వృద్ధి చెందిందంటే ఏ స్పీడ్‌తో పరుగులు తీసిందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది డిసెంబర్ 26న కేజీ వెండి రూ.91,600గా ఉంటే అదిప్పుడు ఏకంగా రూ.2,36,350ని తాకి రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర 45.43 డాలర్లుగా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి 72.70 డాలర్లకు అంటే రెండు నెలల్లో 69 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 72.70 డాలర్లు తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గడిచిన ఏడాదికాలంలో పది గ్రాముల బంగారం ధర రూ.77,730 నుంచి 79.10 శాతం పెరిగి రూ.1,39,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరినా ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనుకపడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లైతే ఈ ఏడాది కాలంలో కేవలం 10 శాతం రాబడులను మాత్రమే అందించాయి.

న్యూ ఏజ్ టెక్నాలజీ వల్లే భారీ పెరుగుదల
పారిశ్రామికంగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సోలార్ విద్యుత్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్‌లో 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తారంటే వెండి ఎంత కీలకపాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
2024లో సుమారు రెండు కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, సెమీ కండక్టర్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతుండడంతో సిల్వర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండటం వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీనికితోడు యుద్ధ భయాలు, అమెరికా టారిఫ్ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తుండటంతో అన్నీ రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని, ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు. దీనికితోడు మన దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో 8 శాతంపైగా పతనం కావడం మరింత కలిసొచ్చిందంటున్నారు.
ఇంకా పెరిగితే రిస్కే ఎక్కువ
ఇతర మెటల్స్‌తో పోలిస్తే వెండి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే వేగంగా పతనమవుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తుండటంతో ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం – వెండి ధరల మధ్య ఉండే తేడాని గోల్డ్ సిల్వర్ రేషియోగా లెక్కిస్తారు. 2025లో 107గా ఉన్న గోల్డ్ సిల్వర్ రేషియో నిష్పత్తి వెండి పరుగుతో అది 64కి పడిపోయింది.
2016, 2021లో కూడా ఈ నిష్పత్తి ఈ స్థాయికి చేరినప్పుడు వెండి ధరలు బాగా పతనమైన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కేజీ వెండి ధర రానున్న రోజుల్లో రూ.2.50 లక్షల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పది గ్రాముల బంగారం రూ.1.65 లక్షలకు చేరుకోవచ్చని... ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ధరల్లో కొంత సర్దుబాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టకొని బంగారం, వెండిలో ఒకేసారిగా కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా వీరు సూచిస్తున్నారు.
కరెక్షన్‌కు అవకాశం
కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరికొంత పెరిగినా దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు అంతకంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో పతనం కూడా అంతే వేగంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాంకేతికంగా చూస్తే రికార్డు స్థాయికి చేరిన సిల్వర్‌లో లాభాల స్వీకరణకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో వెండి ధరలు పెరిగే అవకాశాలున్నా మధ్యలో ఒక భారీ కరెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. – సతీష్ కంతేటి, డైరెక్టర్, జెన్ సెక్యూరిటీస్


