చలి, దట్టమైన చీకటి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు.. ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ వాతావరణాన్ని ఒక నగరం సగర్వంగా స్వాగతిస్తోంది. అమెరికాలోని అత్యంత ఉత్తరాన ఉన్న చిన్న పట్టణం, ఉట్కియాగ్‌విక్, అలాస్కా, 2025లో తన చివరి సూర్యాస్తమయాన్ని చూసింది. సరిగ్గా నవంబర్ 19వ తేదీ బుధవారం.. ఈ ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఇక ఈ ప్రాంత వాసులు మళ్లీ సూర్యుడిని చూడాలంటే, 64 సుదీర్ఘ రాత్రులు గడిచిపోవాల్సిందే! అవును. ఈ పట్టణం ఇప్పుడు తన వార్షిక ’ధ్రువరాత్రి’ లోకి ప్రవేశించింది, ఇది జనవరి 22, 2026 వరకు కొనసాగుతుంది.
భూమి వంపు వల్లే ఈ అద్భుతం
ఇంత సుదీర్ఘమైన చీకటికి కారణం గ్రహాంతర సంబంధమో, గ్రహశకలమో కాదు. ఇది కేవలం భూమి అక్షం వంపు ఆర్కిటిక్ సర్కిల్‌పై ఉట్కియాగ్‌విక్ ఉన్న స్థానం వల్ల జరిగే సహజ పరిణామం. ధ్రువ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హోరిజోన్ కిందే ఉండిపోతాడు.
పూర్తి చీకటి కాదు..
నిజానికి, 64 రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తుంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఉట్కియాగ్‌విక్‌ను వెలిగిస్తుంది. దీనిని సివిల్ ట్వైలైట్ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ దైనందిన కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు. దీనికి తోడు, అద్భుతమైన ’అరోరా బోరియాలిస్’ లేదా నార్తర్న్ లైట్స్ కూడా ఈ చీకటి రాత్రులలో అద్భుతమైన వెలుగును అందిస్తాయి.
ఉష్ణోగ్రతల పతనం
సూర్యరశ్మి లేకపోవడం అంటే, పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. సూర్యరశ్మి ద్వారా లభించే సహజ ఉష్ణోగ్రత లేకపోవడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయి. ఈ సుదీర్ఘ చీకటి కాలం నుంచే పోలార్ వోర్టెక్స్ అనే భారీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఇది అత్యంత శీతల గాలిని కలిగి ఉంటుంది. ఈ పోలార్ వోర్టెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతూ.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి ప్రభావాన్ని చూపుతుంది.
84 రోజులు అంతులేని వెలుగు!
ఉట్కియాగ్‌విక్ కేవలం సుదీర్ఘ చీకటికి మాత్రమే కాదు, అద్భుతమైన వైరుధ్యానికి కూడా నిదర్శనం. శీతాకాలంలో 64 రోజులు చీకటి ఉంటే, వేసవిలో పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది. ఇక్కడ దాదాపు మూడు నెలల పాటు.. అంటే సుమారు 84 రోజులు నిరంతరాయంగా పగటి వెలుతురు ఉంటుంది. ఈ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడి 4,400 మంది నివాసితులు పెద్ద సవాల్‌ను స్వీకరించారు.
వేసవిలో, అమెరికాలోని అత్యంత ఉత్తరాన ఉన్న బారో హై స్కూల్ ఫుట్‌బాల్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భూమి అక్షం వంపు మానవ జీవితాలపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో, ఆర్కిటిక్‌లో జీవనం ఎంత అద్భుతమైన అనుకూలతను కలిగి ఉంటుందో ఈ ధ్రువ రాత్రి నిరూపిస్తోంది. జనవరి 22, 2026న సూర్యుడు తిరిగి ఉదయించే ఆ క్షణం కోసం ఉట్కియాగ్‌విక్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
-సాక్షి, నేషనల్ డెస్క్


