సన్‌ క్యాండిల్‌  | Sun candle or portal to another dimension | Sakshi
Sakshi News home page

సన్‌ క్యాండిల్‌ 

Dec 14 2025 5:51 AM | Updated on Dec 14 2025 5:51 AM

Sun candle or portal to another dimension

సకల ప్రాణకోటికి దినకరుడే ప్రత్యక్ష దైవం. నిత్యం ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రకృతిలో భిన్న కాలాలకు సూరీడే కారణభూతంగా నిలుస్తున్నాడు. సకల చరాచర జీవకోటికి శక్తిప్రదాతగా దేదీప్యమానంగా వెలిగిపోయే సూర్యుడు ఇదే ప్రకృతిలో ఎన్నెన్నో వింతలకు హేతువుగా ఉన్నాడు. అందులో ఒకటే సన్‌ క్యాండిల్‌.

 సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తులో కదలాడే సిర్రస్‌ మేఘాల్లోని స్ఫటిక మంచు బిందువుల కారణంగా ఈ సూర్య కొవ్వుత్తులు వెలిగి చూపరులకు నేత్రానందం కల్గిస్తున్నాయి. తాజాగా ఆ్రస్టియాలోని ఒక మంచుమయ పర్వత సానువుల్లో స్కీయింగ్‌ చేస్తున్న ఒక బృందం ఎదుట ఈ సన్‌ క్యాండిల్‌ ప్రత్యక్షమైంది.

 దీంతో అక్కడి వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అత్యంత అరుదైన ఈ వింతను అక్కడి స్కీయర్‌ లెంకా ల్యాంక్‌ వెంటనే తన కెమెరాకు పనిచెప్పారు. ల్యాంక్‌ తీసిన ఈ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లో చూపించినట్లుగా హఠాత్తుగా ఏర్పడిన ఈ వింతను చూసి కంగారుపడ్డా. దగ్గరికెళ్లి చూద్దామనుకున్నాగానీ భయపడిపోయా. ఎందుకంటే సమాంతర విశ్వానికి ఇది ముఖద్వారమేమో అన్నట్లు అనిపించింది’’అని లెంకా ల్యాంక్‌ వీడియో లైసెన్సింగ్‌ వేదిక అయిన ‘వైరల్‌హోగ్‌’లో రాసుకొచ్చారు.

ఎలా ఏర్పడుతుందంటే?.. 
ఇదొక సూర్యకాంతి సంబంధ దృగి్వషయం. సిర్రస్‌ మేఘాల మీదుగా కాంతి నేల మీదపై పడే సందర్భాల్లో ఈ సన్‌ క్యాండిల్‌ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచు పొగలో కోట్ల సంఖ్యలో అతి సూక్ష్మ, స్ఫటికాకార, సమతల మంచు బిందువులు ఉంటాయి. వీటిల్లో కొన్ని భూమికి సమాంతరంగా ఏర్పడినప్పుడు చూడ్డానికి అవన్నీ స్ఫటికాల్లా ప్రవర్తిస్తాయి. 

అంటే అద్దంలా అన్నమాట. తమ మీద పడిన కాంతిని అచ్చంగా మళ్లీ అదే దిశలో పరావర్తనం చెందిస్తాయి. అలా పై నుంచి కిందకు వచ్చే కాంతి కిరణాలను ఈ స్ఫటిక బిందువులు తిరిగి ఎగువ దిశలో పంపిస్తాయి. దీంతో వెండి రంగులో దేదీప్యమానంగా వెలిగిపోయే కొవ్వొత్తులు ఏర్పడతాయి. సాధారణంగా పర్వత శిఖరాల వంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో సన్‌ క్యాండిల్‌ ఆవిష్కృతమవుతుంది. 

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లోనే ఈ క్యాండిళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. సూర్యకాంతి పుంజం ఇలా పడి మళ్లీ అలా పైకి వెళ్తుండటంతో వీటిని సూర్య స్తంభాలు అని కూడా అంటారు. విమానాల్లోంచి కిందకు చూసినప్పుడు కూడా మంచు పర్వతాల సమీపంలో ఇలాంటి కాంతి కొవ్వొత్తులను చూడొచ్చు. ఎంత ఎక్కువగా స్ఫటిక మంచు బిందువులు ఒకే కోణంలో ఏర్పడతాయో అంతగా అతిపెద్ద కొవ్వొత్తి ఏర్పడుతుంది. అప్పుడు దానిని నేరుగా కంటితో చూడలేం. అంత ధగద్దాయమానంగా అది వెలిగిపోతుంది. మేఘాల లోపలి నుంచి దూసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని సార్లు విమాన కాక్‌పిట్‌లోని పైలట్ల కంట పడతాయి. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement