breaking news
phenomenon
-
కళ్ళు మూసుకున్న సమాజానికి కన్నతల్లి మేలుకొలుపు!
కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాలు సైతం పట్టుమని వారమైనా ఆడని ఈ రోజుల్లో... ఒక నాటిక గత 13 నెలల కాలంలో వివిధ ప్రాంతాల్లో సగటున వారానికి ఒక ప్రదర్శన జరుపుకుందంటే నమ్మగలరా. ఈ వింతకు ఓ తెలుగు డ్రామా కారణమైందన్న మాట కలలోనైనా ఊహించగలరా. అవును... మీరు విన్నది నిజమే. అందుకే, ఇది అపూర్వమే కాక అందరినీ ఆశ్చర్యపరిచే సందర్భం. ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే ఓ తెలుగు నాటిక రంగస్థలంపై రాకెట్ లా దూసుకుపోతోంది. తెలుగు నేలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ... ప్రతి చోటా ప్రేక్షకాదరణతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే... 53 ప్రదర్శనలు! 150 బహుమతులు!!ఇటీవల ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే కేవలం నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు వేదికలపై (గచ్చిబౌలిలో రంగభూమి, లకడీకాపూల్ వద్ద రవీంద్రభారతి) ఈ నాటిక ప్రదర్శన జరిగింది. రెండు చోట్లా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వెనువెంటనే కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గర ప్రదర్శనకు సిద్ధమైంది. వెరసి, ఈ మే నెల ప్రథమార్ధంలో వారం రోజుల్లోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రదర్శనలు. ప్రదర్శన జరిగిన ప్రతిచోటా ఈ నాటికకు జేజేలు. నటి – రచయిత్రి జ్యోతిరాజ్ బీశెట్టి రచించగా, గోవాడ క్రియేషన్స్ పతాకంపై నట - దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ సారథ్యంలోని నట, సాంకేతిక బృందం ఈ ఘనత సాధించింది. గుజరాత్‌లోని వడోదరాలో సైతం సభికులతో స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న సమకాలీన రంగస్థల సూపర్ హిట్ ఇది.అంతేకాదు... తెలుగు నేలపై దాదాపు 35 నాటక పరిషత్తులు జరుగుతుంటే, అందులో 32 పరిషత్తుల్లో ఈ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ నాటికగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లోనే నిలిచి, 32 బహుమతులు సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలా పలు విభాగాల్లో ఈ నాటిక ఇప్పటి వరకు ఒకటీ, రెండు కాదు... ఏకంగా 150 దాకా బహుమతులు గెలుచుకొని, అరుదైన ఘనత సాధించింది. “ఇటీవలి కాలంలో ఓ తెలుగు నాటిక వరుసగా ఇన్ని ప్రదర్శనలు, ఇంత ప్రాచుర్యం, ప్రజాదరణ సంపాదించింది లేదు. అందుకే, సమకాలీన తెలుగు రంగస్థల చరిత్రలో ఈ నాటికకు ప్రత్యేక స్థానం ఉంది” అని సీనియర్ రంగస్థల పరిశోధకులు, రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు వ్యాఖ్యానించారు.సరిగ్గా గత ఏడాది మార్చి చివరలో (2025 మార్చి 28) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నెలకొన్న ‘రంగభూమి స్పేసెస్’లో ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తొలి ప్రదర్శన జరిగింది. ఏడాది తిరిగేసరికల్లా... 50 ప్రదర్శనలు పూర్తి చేసుకొని, ఈ మే నెల 5న సరిగ్గా అదే ప్రాంగణంలో 51వ ప్రదర్శన జరగడం గమనార్హం. అంతేకాదు... సినిమాలే యాభై రోజుల విజయోత్సవం జరుపుకోవడం గగనమవుతుంటే, ఓ నాటిక యాభై ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా అభినందన సభ, ప్రత్యేక ప్రదర్శన జరిపారు.ఆ పోషకుల్ని అంతగా కదిలించిందేమిటి?కళాపోషకులు, రసహృదయలైన గుదే పాండురంగారావు దంపతులు ఈ ప్రదర్శన, విజయోత్సవం ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఆ దంపతులు, వారి బృందం ఎన్.టి.ఆర్. కళాపరిషత్ పక్షాన ప్రత్యేకంగా హైదరాబాద్‌లో వచ్చి మరీ, ఈ 51వ ప్రదర్శన, విజయోత్సవం నిర్వహించడం వారి కళాప్రియత్వానికి మచ్చుతునక. “నేను నటుణ్ణి, దర్శకుణ్ణి కాదు. కేవలం కళాభిమానిని. మూడో ప్రదర్శన సమయంలోనే ఈ నాటిక చూశాను. నాలుగేళ్ళుగా పరిషత్ నాటకాల పోటీలు నిర్వహిస్తున్న నాకు ఈ నాలుగేళ్ళ కాలంలో మనసుకు బాగా నచ్చిన నాటిక ఇది. అందుకే, అభినందించాను. అంతేకాకుండా, ఈ నాటిక ఊరూరా ప్రదర్శనలతో అఖండ విజయం సాధిస్తుందని చెప్పాను. యాభై ప్రదర్శనలు పూర్తయినప్పుడు మా సంస్థ పక్షాన ఉత్సవం చేస్తామనీ అప్పుడే మాట ఇచ్చాను. మా అంచనా నిజమై, ఈ నాటిక ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉంది” అని పాండురంగారావు తన భావాలు పంచుకున్నారు. ఇంతగా అందరినీ కదిలించిన ఈ నాటికలో ఇంతకీ ఏముంది అంటే... అమ్మ ప్రేమ ఉంది. కట్టుకున్నవాడు కాదన్నా, కంచెలు వేసిన సమాజం ఏమన్నా సరే... కన్నబిడ్డలోని శారీరకమైన మార్పునూ, మానసికమైన సంఘర్షణనూ అర్థం చేసుకున్న అసలైన అమ్మదనం ఉంది. బ్రహ్మ చేసిన మానవ సృష్టిని అర్థం చేసుకొని, కడుపున పుట్టిన బిడ్డ కష్టాన్ని అవగాహన చేసుకొని, కడుపులో పెట్టుకొని కాపాడి, కృషితో విజయతీరం వైపు నడిపించిన అపర బ్రహ్మ అమ్మ గొప్పదనం ఉంది. ఓ ట్రాన్స్ జెండర్ తాలూకు ఆవేదన ఉంది. మన మధ్యే ఉన్న అలాంటి మనుషుల పట్ల మనకుండాల్సిన కనీసపాటి మానవత్వం గురించి ఆలోచన ఉంది. వాళ్ళూ మనలాగే మనుషులే అన్నది మర్చిపోతున్న మన దృష్టికోణంలోని లోపాన్ని ప్రశ్నించడం ఉంది. మారాల్సిన మన తీరును గుర్తు చేయడం ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే.... మనిషి సృష్టికర్త బ్రహ్మ అయినా, ఆ మనిషిని ఈ లోకంలోకి తెచ్చిన అమ్మే... మన లోపాలనూ, మనసునూ అర్థం చేసుకొని, సరైన మార్గంలో పెట్టి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దగల మరో బ్రహ్మ. ఆ మాటే ఈ నాటిక భావోద్వేగాలతో బలంగా చెబుతుంది.కనిపించని దేవుడి తప్పు... కని పెంచిన అమ్మ తీర్పు ఇటీవలి కాలంలో భిన్నమైన ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న నాటిక ఇది. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద అమ్మ కథాంశంగా సాగే ఓ నాటికల రచన పోటీ గతంలో నిర్వహించారు. అందులో ద్వితీయ బహుమతి పొందిన నాటిక ఇది. దానికి మరింత మెరుగులు దిద్ది, దేశం నలుమూలలా చేస్తున్న ప్రదర్శన – ‘అమ్మ చెక్కిన బొమ్మ’.స్థూలంగా కథ చెప్పాలంటే... అబ్బాయిగా పుట్టి, స్కూలు చదువులకు ఎదుగుతాడు శశి (బాల నటుడు భానుప్రకాశ్). అయితే, హార్మోన్ల మార్పు ఫలితంగా అమ్మాయిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని తల్లి అనసూయ (నటి జ్యోతిరాజ్ బీశెట్టి) గ్రహిస్తుంది. భర్త గోవర్ధన్ (నటుడు వెంకట్ గోవాడ) – బంధువులు – లోకం ఏమన్నా సరే ఆ బిడ్డ మానసిక పరిస్థితికే తల్లి మద్దతుగా నిలుస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా, సహిస్తుంది. భరిస్తుంది. అదే సమయంలో కన్నబిడ్డ దారి తప్పకుండా చూస్తుంది. అతని మానసిక స్థితికి అనుగుణంగా శారీరకంగా అమ్మాయిగా (వెన్నెల పాత్ర – నటి హర్షిణి మేకల) మారేందుకు అవసరమైన వైద్యచికిత్స చేయిస్తుంది. ఏటికి ఎదురీదుతుంది. అపురూపమైన అమ్మ ప్రేమ, త్యాగం, కష్టం చూసిన ఆ బిడ్డ, కన్నతల్లికి మాటిచ్చి మరీ, చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది. చివరకు ‘వెన్నెల ఐ.ఏ.ఎస్’ అవుతుంది. అక్షరాలా ‘అమ్మ చెక్కిన బొమ్మ’గా సమాజంలో నిలుస్తుంది. కనిపించని దేవుడు చేసిన తప్పును, కని పెంచిన అమ్మ ఓ దేవతలా అలా సరిచేస్తుంది. సమస్యల్ని గెలుస్తుంది.తెలుగులో అరుదైన ఇతివృత్తంఆధునిక తెలుగు నాటకరంగం 1860 ప్రాంతంలో ఆరంభమయ్యాక... స్త్రీ, పురుషులు కాక, ఈ తృతీయ ప్రకృతిని సైతం రంగస్థలంపై పాత్రలుగా చూపెడుతూ ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ సహా పలు నాటికలు, నాటకాలు రాకపోలేదు. కానీ, జన్మ రీత్యా పురుషుడైన పాత్ర ఆధునిక వైద్యవిధానంతో స్త్రీగా మారడం, మారేందుకు పడిన మానసిక సంఘర్షణ, కుటుంబంలో – సమాజంలో ఎదుర్కొన్న చిక్కులు... లాంటి అంశాలను సున్నితంగా చూపెడుతూ, ఆలోచింపజేసిన ప్రయత్నం మాత్రం ‘అమ్మ చెక్కిన బొమ్మే’ అని రంగస్థల పరిశీలకుల మాట. “ఎన్నో రంగస్థల రచనలు చేసిన నేను కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే, ఈ నాటిక చూసినప్పుడు ఆనందంతో కూడిన అసూయకు లోనయ్యాను” అని కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ అని ఛలోక్తిగానే ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శనను ప్రశంసించారు. ‘7 స్టెప్స్ ఎరౌండ్ ది ఫైర్’ అంటూ ఇంగ్లీషులో మహేశ్ దత్తానీ, అలాగే తొమ్మిది మంది హిజ్రా పాత్రలతో నవరసాలను అభినయింపజేస్తూ ‘నవ’ అంటూ కన్నడంలో శరణ్యా రామ్ ప్రకాశ్ చేసిన ప్రయోగాలను ఆయన ప్రస్తావించారు.రంగభూమిపై.. భావోద్వేగ ప్రయాణం!ఇటు భర్త – అటు బిడ్డల మధ్య నలిగిపోయి, చివరకు కట్టుకున్నవాడి కన్నా, కన్నబిడ్డ వైపు మొగ్గే తల్లి పాత్రలో జ్యోతిరాజ్ వివిధ భావోద్వేగాలను పండించారు. గెంటేస్తానంటున్న తండ్రి – గేళి చేస్తున్న తోటి స్నేహితులు – శరీరంలో తనకు తెలియకుండానే కలుగుతున్న భావాల మధ్య, మానసికంగా సంఘర్షణలో చిక్కుకొన్న బాలుడు శశి పాత్రపోషణ ఈ నాటికకు మరో మూలస్తంభం. గతంలో పలు సినిమాల్లోనూ నటించిన బాలనటుడు భానుప్రకాశ్ అమ్మాయిగా మారాలనుకొనే అబ్బాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఓ సన్నివేశంలో “అమ్మా! నిన్ను ముట్టుకోవచ్చా అమ్మా?” అంటూ బాధ, ఆవేదన, సంకోచాలను అభినయించినప్పుడు అప్రయత్నంగా ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాడు.తండ్రి పాత్రలో నటించడమే కాక, వీలైనంత తక్కువ సెట్టింగులతోనే ప్రతీకాత్మకంగా నాటకాన్ని నడిపించడంలో దర్శకుడు వెంకట్ గోవాడ అనుభవం, శ్రమ అభినందనీయం. నిజజీవితంలో ట్రాన్స్ జెండరైన హర్షిణి తన జీవితానుభవాన్ని వెన్నెల పాత్రలోకి ప్రవహింపజేశారు. చివరకు వచ్చేసరికి, “ఆపదలలో తోడు లేని నేను, ఆనందంలో భాగం ఆశించకూడదు. నువ్వు తల్లిగా గెలిచావు, నేను తండ్రిగా ఓడిపోయాను” అంటూ నేపథ్యంలో వినిపించే తండ్రి పాత్ర మాటలు ఆగి, ఆలోచింపజేస్తాయి. ఇన్ని ప్రదర్శనలుగా ఓ నాటిక విజయవంతం కావడం వెనుక ఎంత సమష్టి కృషి ఉందో కూడా ప్రదర్శన చూసినవారు ఇట్టే గ్రహిస్తారు.ప్రాణమై నిలిచిన పాట, సంగీతం!“బొమ్మరా ఇది బొమ్మరా... అమ్మ చెక్కిన బొమ్మరా....” అంటూ నాటికలో వివిధ సందర్భాల్లో వినిపించే శీర్షికా గీతం మరో హైలైట్. “బృహన్నలకు బంధువా, శిఖండికి తా చిహ్నమా, అర్ధనారి స్వరూపమా, మోహినీ అవతారమా” అంటూ నాటికా రచయిత్రే రాసిన ఈ పాట, దానికి సురభి నాగరాజు చేసిన బాణీ కరుణ రసాత్మకంగా నేరుగా మనసు తాకుతాయి. వర్ధమాన గాయని ఎన్. శ్రీనిధి తన గళంతో ఆ పాటకు మరింత జీవం నింపారు. “పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోదనెవరిది” అన్న మాటలు ఆమె గొంతులో పలికినప్పుడు కరగని ప్రేక్షక హృదయం అరుదు.అలాగే, “అమ్మ ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ లాలనకు అంతమేది, అమ్మ కన్నా మిన్న ఏది” అన్న చరణం వింటుంటే కన్నతల్లి జ్ఞాపకాలు గుర్తుకు రానివారూ ఉండరు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే, కళారంగంలో మనకు మరో మంచి గాయని లభించినట్టే! “నిజానికి, ఆ పాట, ఆ బాణీ, శ్రీనిధి పాడిన విధానం... ఈ నాటికను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముందుగా నేను ఊహించిన దాని కన్నా ఎక్కువగా పదుల కొద్దీ ప్రదర్శనలకు ముందుకు నడిపించడంలో ఓ కీలక పాత్ర పోషించాయి” అని ఈ నాటక రథసారథి వెంకట్ గోవాడ స్వయంగా వివరించారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే, నేపథ్య సంగీతం, లైటింగ్ సైతం ఈ నాటిక ప్రదర్శనలకు అంతే ఆయువుపట్టుగా నిలిచాయని ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది.“మనసు చంపుకొని నటిస్తున్నాం!”: సినీ నటి శివపార్వతిఈ నాటికను తిలకించిన ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటి శివపార్వతి, నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటకంపై ప్రేమతో ఒకప్పుడు తామెలా రంగస్థలంపై కృషి సాగించిందీ గుర్తు చేసుకున్నారు. “నా పదమూడో ఏట నుంచి నేను రంగస్థలం ఒడిలోనే పెరిగాను. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో నాటక రంగం నుంచే వెండితెరకు పరిచయమయ్యాను. ఇవాళ సినిమా, టీవీ, ఓటీటీ ఎన్నో వచ్చినా... నటిస్తున్నా... నాకు అన్నం పెట్టి, నన్ను ఇంతదాన్ని చేసిన రంగస్థలాన్ని మర్చిపోలేదు. కరెంట్ పోయినా, వర్షం పడి తడుస్తున్నా... అంకితభావంతో సాగించిన ఆ రోజుల్ని మర్చిపోలేను. కానీ, ఇవాళ చాలా సందర్భాల్లో కెమెరా ముందు మనసు చంపుకొని నటించాల్సి వస్తోంది. ‘ఆఁ’, ‘ఊఁ’, ‘అమ్మా నాన్న’ లాంటి వాటికి కూడా ప్రాంప్టింగ్ చెప్పించుకొనే తరం, పరభాషీయులదే పెత్తనం. మనం ఏదన్నా చెప్పినా చాదస్తంగా భావిస్తూ, ‘మీకు నటన తెలీదు. ఆ నాటకాల నటన వద్దు’ అని కించపరిచిన చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. కానీ, అదే షూటింగ్ సెట్ లో... ఒకే షాట్లో 3 పేజీల డైలాగును ఏకబిగిన చెప్పి అందరితో శభాష్ అనిపించుకున్నానంటే అది రంగస్థల అనుభవం పెట్టిన భిక్షే” అని శివపార్వతి తన మనోభావాలను పంచుకున్నారు.రంగస్థల ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల ప్రదర్శనల గుణనిర్ణేత మానాపురం సత్యనారాయణ, తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనమైన ‘వేదిక’ సంస్థకు అధ్యక్షుడైన రంగస్థల, సినీ, టీవీ నటుడు ముత్తవరపు సురేశ్ బాబు, మరో నటుడు చలపతిరాజు తదితరులు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ బృందాన్ని ప్రశంసించారు. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ వారు సైతం తెలుగు రంగస్థలాన్ని చూసి అబ్బురపడేలా ఆ మధ్య గుంటూరులో జాతీయ నాటకోత్సవాలకు తాము ఆతిథ్యం ఇచ్చిన సంగతులను ముత్తవరపు ప్రస్తావించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో “ఏటా పుచ్చలపల్లి సుందరయ్య నాటక కళాపరిషత్ ద్వారా ఇప్పటికి 23 ఏళ్ళుగా సాగిస్తున్న కృషి చేస్తున్నాం. సమాజంలోని వివిధ రంగాలకు చెందిన 20 మంది న్యాయ నిర్ణేతలతో నిష్పాక్షికంగా విజేతలను ఎంపిక చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే, త్వరలోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగస్థలంపై కొత్త పద్ధతిలో, భారీ నాటక ప్రదర్శనగా రూపొందించాలని యోచిస్తున్నాం” అని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.హాస్య దర్శకుల్ని మెప్పించిన సెంటిమెంట్‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శన ప్రముఖ సినీ దర్శకుల, పత్రికా విమర్శకుల ప్రశంసలు సైతం పొందడం అసామాన్యం. గురువు దాసరి నారాయణరావు బాటలోనే పయనించి, 90కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు తన ప్రసంగంలో, “పదిహేనేళ్ళ వయసులోనే పాలకొల్లులో నాటకాల్లో పాల్గొన్న అనుభవం నాది. చాలా రోజుల తర్వాత ‘అమ్మ చెక్కిన బొమ్మ’ రూపంలో ఓ మంచి నాటిక చూశాను. హాస్య చిత్రాల దర్శకులుగా పేరొందిన నన్ను, శివనాగేశ్వరరావును కదిలించి, కన్నీరు పెట్టించిన సెంటిమెంటల్ డ్రామా ఇది. మా గురువు దాసరికి సినిమాలే జీవితమైతే, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రంగస్థలానికే అంకితమైన గోవాడకు నాటకాలే జీవితం. ఆదుర్తి, దాసరి లాంటి దిగ్దర్శకుల బాటలో ఈ నాటికలో సింబాలిక్ షాట్స్‌ను దర్శకుడు గోవాడ బాగా ఉపయోగించారు” అని అభినందించారు.దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, “రచయిత, దర్శకుడు పోటాపోటీగా చేసిన నాటిక ఇది. ఇదే నాటికను ఆ మధ్య పరిషత్ పోటీల్లో చూసి, న్యాయనిర్ణేతలందరం ఏకాభిప్రాయంతో అనేక బహుమతులు ప్రకటించాం. ఇప్పుడు రెండోసారి చూస్తున్నా, రంగస్థలంపై రసానుభూతి మారలేదు. నాలో స్పందన మారలేదు. తొలిసారి ఎక్కడ కంట నీరు పెట్టుకున్నానో, ఈసారీ అక్కడే అప్రయత్నంగా కన్నీరు ఒలికింది. ఒక కళారూపం విజయానికి అంతకు మించిన గీటురాయి ఏముంటుంది” అన్నారు. క్యారవాన్ సంస్కృతితో నేడు సినీ నటుల్లో సైతం కొరవడిన ప్రొఫెషనలిజం నటిగా జ్యోతిరాజ్లో చూసి, ఆనందం, ఆశ్చర్యం కలిగాయి అని సినీ దర్శకుడు యాట సత్యనారాయణ ప్రశంసించారు. సీనియర్ జర్నలిస్ట్-రచయిత డాక్టర్ రెంటాల జయదేవ ప్రసంగిస్తూ, ఇతివృత్తం ఎంపిక, నాటిక నిర్వహణ, నటీనటుల అభినయంలోని ప్రతిభా ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. “ముఖ్యంగా, తానే ఆ పాత్రగా మారి, అమ్మాయిగా కూడా అద్భుతంగా హావభావాలు చూపిన భానుప్రకాశ్ ఇలాగే శ్రద్ధగా కృషి చేస్తే, మరో జూనియర్ ఎన్టీఆర్ అంతవాడు అవుతాడు” అని అంచనా వేశారు.మంచిరోజులు మళ్ళీ వస్తున్నట్టే(నా)!?వెరసి, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం ఈ మధ్య కాలంలో తెలుగు నాటకానికి కొత్త ఉత్సాహం తెచ్చింది. నట, సాంకేతిక బృందాన్ని, అతిథులనూ ఎన్.టి.ఆర్. కళాపరిషత్ స్థాపకులు పాండురంగారావు పేరు పేరునా ప్రత్యేకంగా ఆహ్వానించి, జ్ఞాపికలతో సత్కరించడం కళాకారుల కళ్ళల్లో వెలుగులు నింపింది. “నిర్విరామంగా నాటకోత్సవాలు జరుపుతున్న మా పరిషత్ రానున్న రోజుల్లోనూ ఇలాంటి మంచి నాటకాలను ఇలాగే మరింత ప్రోత్సహిస్తుంది. తెలుగు నాటకం దానికి అదే ఓ ఆదాయవనరుగా మారాలనీ, కళాకారులు రంగస్థలం మీదే ఆధారపడి జీవనోపాధి సంపాదించుకొనే స్థాయికి మన నాటకరంగం ఎప్పటికైనా చేరాలనీ నా కోరిక. అందుకోసం ఉడతాభక్తిగా మా సంస్థ వంతున కృషి చేస్తాము” అని పాండురంగారావు తన సతీమణి సాక్షిగా ప్రేక్షకుల చప్పట్ల మధ్య ప్రకటించారు. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ సతీమణి, చివరకు ఎం.బి.బి.ఎస్. చదివిన వారి కుమార్తె సైతం ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికలో నటించడం, ప్రదర్శన రక్తి కట్టడానికి ప్రతి చిన్నపనిలో భాగం కావడం గమనార్హం. రంగస్థలంపై ఆ కుటుంబానికి ఉన్న ప్రేమ, అంకిత భావాలకు అది నిదర్శనం. అంతేకాదు... సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నా అభినయంపై ఆసక్తితో ఇంకా పలువురు యువతీ యువకులు ఈ ప్రదర్శనలో భాగమైన తీరు చూసినప్పుడు ముచ్చటేస్తుంది. అలాగే, నగరం నడిబొడ్డుకు దూరంగా ‘రంగభూమి’లో ప్రదర్శన జరుగుతున్నా... ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం, ఆకస్మిక వర్షం - విద్యుత్ సరఫరా లోపాల మధ్య కూడా ఆసక్తిగా ఆసాంతం కూర్చోవడం తెలుగు నాటక రంగంపై ఆశలు చిగురింపజేస్తోంది. సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉంటే కొత్త తరం రంగస్థలంపై విజృంభిస్తుంది. సరికొత్త ఇతివృత్తాలు, సమయపాలన, ప్రొఫెషనలిజం ఉంటే... ప్రేక్షకులు సైతం నేటికీ నాటకాన్ని ఆదరిస్తారని అర్థమవుతోంది. అందుకు ఒకరకంగా, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం శుభ నాందీ సూచకమైతే... మన రంగస్థలానికి కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్టే!::: రెంటాల జయదేవ -
జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన దృశ్యం.. వీడియో వైరల్
అఖ్నూర్: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో అరుదైన టోర్నడో 10 నిమిషాల పాటు భీభత్సం సృష్టించింది. కశ్మీర్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ టోర్నడో జనావాసాలకు దూరంగా ఉండటంతో దీంతో ఎటువంటి నష్టం కలుగలేదు. వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించిన టోర్నడ్ను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. టోర్నడో వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.టోర్నడో మూడు గంటల తర్వాత వాతావరణ శాఖ విశ్లేషించింది. నార్వెస్టర్ తుపానుల వల్ల ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితులే ఈ టోర్నడో-లాంటి ఫార్మేషన్కు కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మళ్ళీ టోర్నడోలు వచ్చే అవకాశం లేదని డాప్లర్ వాతావరణ రాడార్ డేటా తెలిపింది. ప్రస్తుతం 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా టోర్నడో ఆనవాళ్లు లేవని పేర్కొంది.Rarest of the rare!A tornado spotted in Akhnoor, Jammu yesterday — an extremely unusual event for the region.Even across Bharat, such fully developed tornadoes are rare. pic.twitter.com/NLXd2DkVJo— Dr. Vineet Kumar (@vineet_mausam) April 12, 2026టోర్నడో అత్యంత శక్తివంతమైన గాలి తుఫాను. భారీ గాలి సుడిగాలి. ఇది తీవ్రంగా తిరిగే గాలి స్తంభం రూపంలో ఉంటుంది. అమెరికాలో ఇటీవల టెక్సాస్, ఒక్లహామా, మిస్సోరి, కాన్సాస్, కెంటకీ రాష్ట్రాల్లో టోర్నడోలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. -
గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!
-
ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!
ఆఫ్రికాలోని గ్రీకు ద్వీపమైన క్రీట్లో బుధవారం ప్రకృతి ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఇతర గ్రహంపై ఉన్నామా అన్నంతగాలా వాతావరణం మారిపోవడంతో స్థానిక నివాసితులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఏమిటీ వింత? ఎందుకు ఇలా జరిగింది?శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఇది ఎటువంటి అతీత శక్తి వల్ల కలిగింది కాదు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవించిన సహజ పరిణామం. దీనికి ప్రధాన కారణం సహారా ఎడారి నుంచి వీచిన భారీ ధూళి తుఫాను. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు, టన్నుల కొద్దీ సన్నని ఇసుక, ధూళి కణాలను మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశగా మోసుకొచ్చాయి. ఈ ధూళి మేఘాల మార్గంలో దక్షిణ ఏజియన్ సముద్ర తీరంలో క్రీట్ ద్వీపం ఉండటంతో ఇక్కడ ప్రభావం అత్యధికంగా కనిపించింది.ఆకాశం ఎరుపు రంగులోకి ఎందుకు మారుతుంది?‘వాతావరణంలో ధూళి కణాలు దట్టంగా ఉన్నప్పుడు అవి సూర్యరశ్మిని విడగొడుతాయి(స్కాట్టరింగ్). తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కణాలు చెల్లాచెదురైపోగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి చేరుతాయి. దీనినే ‘రెడ్ స్కై ఫినామినా’ అంటారు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.పర్యావరణానికి వరప్రసాదం.. కానీ..ఈ ధూళి తుఫాను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పర్యావరణానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి ధూళిలో ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నేలపై చేరినప్పుడు మట్టిని, సముద్రంలో పడినప్పుడు సముద్రపు నాచును సారవంతం చేస్తాయి. అయితే, గాలి నాణ్యత (ఏక్యూఐ) భారీగా పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
సన్ క్యాండిల్
సకల ప్రాణకోటికి దినకరుడే ప్రత్యక్ష దైవం. నిత్యం ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రకృతిలో భిన్న కాలాలకు సూరీడే కారణభూతంగా నిలుస్తున్నాడు. సకల చరాచర జీవకోటికి శక్తిప్రదాతగా దేదీప్యమానంగా వెలిగిపోయే సూర్యుడు ఇదే ప్రకృతిలో ఎన్నెన్నో వింతలకు హేతువుగా ఉన్నాడు. అందులో ఒకటే సన్ క్యాండిల్. సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తులో కదలాడే సిర్రస్ మేఘాల్లోని స్ఫటిక మంచు బిందువుల కారణంగా ఈ సూర్య కొవ్వుత్తులు వెలిగి చూపరులకు నేత్రానందం కల్గిస్తున్నాయి. తాజాగా ఆ్రస్టియాలోని ఒక మంచుమయ పర్వత సానువుల్లో స్కీయింగ్ చేస్తున్న ఒక బృందం ఎదుట ఈ సన్ క్యాండిల్ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అత్యంత అరుదైన ఈ వింతను అక్కడి స్కీయర్ లెంకా ల్యాంక్ వెంటనే తన కెమెరాకు పనిచెప్పారు. ల్యాంక్ తీసిన ఈ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా హఠాత్తుగా ఏర్పడిన ఈ వింతను చూసి కంగారుపడ్డా. దగ్గరికెళ్లి చూద్దామనుకున్నాగానీ భయపడిపోయా. ఎందుకంటే సమాంతర విశ్వానికి ఇది ముఖద్వారమేమో అన్నట్లు అనిపించింది’’అని లెంకా ల్యాంక్ వీడియో లైసెన్సింగ్ వేదిక అయిన ‘వైరల్హోగ్’లో రాసుకొచ్చారు.ఎలా ఏర్పడుతుందంటే?.. ఇదొక సూర్యకాంతి సంబంధ దృగి్వషయం. సిర్రస్ మేఘాల మీదుగా కాంతి నేల మీదపై పడే సందర్భాల్లో ఈ సన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచు పొగలో కోట్ల సంఖ్యలో అతి సూక్ష్మ, స్ఫటికాకార, సమతల మంచు బిందువులు ఉంటాయి. వీటిల్లో కొన్ని భూమికి సమాంతరంగా ఏర్పడినప్పుడు చూడ్డానికి అవన్నీ స్ఫటికాల్లా ప్రవర్తిస్తాయి. అంటే అద్దంలా అన్నమాట. తమ మీద పడిన కాంతిని అచ్చంగా మళ్లీ అదే దిశలో పరావర్తనం చెందిస్తాయి. అలా పై నుంచి కిందకు వచ్చే కాంతి కిరణాలను ఈ స్ఫటిక బిందువులు తిరిగి ఎగువ దిశలో పంపిస్తాయి. దీంతో వెండి రంగులో దేదీప్యమానంగా వెలిగిపోయే కొవ్వొత్తులు ఏర్పడతాయి. సాధారణంగా పర్వత శిఖరాల వంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో సన్ క్యాండిల్ ఆవిష్కృతమవుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లోనే ఈ క్యాండిళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. సూర్యకాంతి పుంజం ఇలా పడి మళ్లీ అలా పైకి వెళ్తుండటంతో వీటిని సూర్య స్తంభాలు అని కూడా అంటారు. విమానాల్లోంచి కిందకు చూసినప్పుడు కూడా మంచు పర్వతాల సమీపంలో ఇలాంటి కాంతి కొవ్వొత్తులను చూడొచ్చు. ఎంత ఎక్కువగా స్ఫటిక మంచు బిందువులు ఒకే కోణంలో ఏర్పడతాయో అంతగా అతిపెద్ద కొవ్వొత్తి ఏర్పడుతుంది. అప్పుడు దానిని నేరుగా కంటితో చూడలేం. అంత ధగద్దాయమానంగా అది వెలిగిపోతుంది. మేఘాల లోపలి నుంచి దూసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని సార్లు విమాన కాక్‌పిట్‌లోని పైలట్ల కంట పడతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నది ఎర్రగా మారింది దేవుడి పడవ కనిపించింది... సైన్స్ ఏం చెబుతోంది?
-
దేవుడు ఏదో చెబుతున్నాడు.. నది ఎర్రగా అందుకే మారిందా?
-
రామరాజ్యంలోనూ రేప్‌లు జరిగాయన్న డీజీపీ!
లక్నో: రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయట.. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ అట.. వాటిని నిరోధించడం ఎవరివల్లా కాదట.. చివరికి పోలీసుల వల్లా కాదంటూ చెత్తులెత్తేసిన పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ. ఉత్తరప్రదేశ్ డీజీపీ జగ్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. త్వరలో రిటైర్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ అసహనంగా స్పందించారు. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. అత్యాచారాలు చాలా సాధారణమని, రామరాజ్యంలో కూడా రేప్‌లు జరిగాయంటూ వివాదాస్పదంగా మాట్లాడి సంచలనం రేపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల గురించి మీడియా ప్రశ్నించినపుడు.. ''మహిళలపై అఘాయిత్యాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. రామరాజ్యంలో కూడా రేప్ లు జరిగాయి'' అంటూ మీడియాపై ఎగిరిపడ్డారు. దీనిపై మరింత వివరణ కోరిన జర్నలిస్టుతో 'నన్ను ప్రైవేట్ గా కలువు, అప్పుడు దీనికి జవాబు చెబుతా' అన్నారు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు కూడా పూర్తిగా అరికట్టలేరంటూ తేల్చి పారేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ వివాదాస్పదంగా స్పందించడంపై పలువురు మండిపడుతున్నారు. డీజీపీ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు.


