ఆ నగరంలో ప్రతీ వీధీ వీనుల విందు చేస్తుంది. ప్రతీ మదీ గానాలాపానలో మునిగి తేలుతుంది. నలు చెరగులా సంగీత ప్రదర్శనల సందడి, చరిత్ర సృష్టించిన సంగీతజ్ఞుల ఒరవడి కనిపించే ఏకైక నగరం అది. అందుకే దానిని మ్యూజిక్ సిటీగా పేర్కొంటారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు గత 2017లో యునెస్కో ద్వారా సంగీత నగరంగా అధికారికంగాఎంపికైంది, ఇంతకీ ఆ నగరం ఏది?ఆ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి?
గొప్ప వారసత్వం...
ఆస్ట్రియా రాజధాని నగరం.. వియన్నా సంగీత నగరంగా పేరొందింది. శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వంతో లోతైన సంబంధానికి ప్రసిద్ధి చెందిన వియన్నా, మొజార్ట్, బీతొవెన్, షుబెర్ట్, హేద్న్, స్ట్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలను అందించింది, వీరే తదనంతర కాలంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మూలంగా నిలిచారు.
గత 18వ 19వ శతాబ్దాలలో, ఈ నగరం గొప్ప స్వరకర్తలు సంగీతకారులను ఆకర్షించి, యూరప్ కు కళాత్మక రాజధానిగా మారింది. ఆస్ట్రియన్ రాచరికం, గ్రాండ్ ఒపెరా హౌస్‌లు, ప్రేక్షకుల మద్దతు కలిసి వియన్నాను సృజనాత్మకతకు చిరునామాగా మార్చింది.
వీధి వీధినా...వీనుల విందేగా...
వియన్నాలో సంగీతం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రతి వీధి, కచేరీ హాల్, కేఫ్ కాలాతీత సంగీత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం సింఫొనీలు ఒపెరాల నుంచి వీధి ప్రదర్శనల వరకు నిర్వహిస్తుంది. ఇక్కడ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే ఒక సజీవ సంప్రదాయం.
సంగీత నగరంగా వియన్నాను మార్చిన ప్రసిద్ధ స్వరకర్తలలో వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ ఒకరు.. ఆయన వియన్నాలో నివసిస్తున్నప్పుడు ది మ్యాజిక్ ఫ్లూట్ ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో వంటివి సృష్టించారు. అందులో వియన్నాలో తొమ్మిదవ సింఫనీతో సహా గొప్ప సింఫొనీలను కంపోజ్ చేసిన లుడ్విగ్ వాన్ బీథోవెన్, వియన్నా స్థానికుడు, వందలాది పాటలు సింఫొనిక్ భాగాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాంజ్ షుబెర్ట్, సింఫొనీ పితామహుడు జోసెఫ్ హేద్న్, వియన్నా వాల్జ్‌ను ప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేసిన జోహన్ స్ట్రాస్ ఉన్నారు.
అలా ఎంతో కాలంగా వియన్నా సంగీతానికి ప్రపంచ కేంద్రంగా ఎదుగుతూనే ఉంది. చాంబర్ రిసైటల్స్ నుంచి గ్రాండ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనల వరకు. ఈ నగరం ప్రతి సంవత్సరం 15,000 కంటే ఎక్కువ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం.
వియన్నా ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా, వియన్నా స్టేట్ ఒపెరా వియన్నా బాయ్స్ కోయిర్ వంటి సంస్థలు నగర సంగీత వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆకట్టుకునే కచేరీ హాళ్లలో లేదా బహిరంగ వేదికలలో ప్రతీ చోటా ఈ సిటీ దైనందిన జీవితంలో సంగీతం భాగమై ఉంటుంది. ప్రతి హృదయం సంగీతంతో మమేకమైపోయి లయబద్ధంగా ధ్వనిస్తుంది.
విశేషాలెన్నో...
ప్రపంచంలోని ఏ ఇతర నగరంలో లేని విధంగా 60 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలకు వియన్నా నిలయంగా ఉంది. నగరంలోని దాదాపు ప్రతి ప్రదేశం సంగీతంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంటుంది.
ప్రసిద్ధ నృత్యం వాల్జ్ 19వ శతాబ్దంలో వియన్నాలో ఉద్భవించింది యూరప్ అంతటా ఆకట్టుకునే నృత్యంగా మారింది.
1842లో స్థాపితమైన వియన్నా ఫిల్హార్మోనిక్ ప్రపంచంలోని పురాతన అత్యంత పేరొందిన ఆర్కెస్ట్రాలలో ఒకటి, ఇది ఆస్ట్రియా కు చెందిన గొప్ప సంగీత శైలిని ప్రతిఫలిస్తుంది.
వియన్నాలో ప్రతి రాత్రి 10 కంటే ఎక్కువ శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతాయి,
ఫిల్హార్మోనిక్ ప్రదర్శించే వార్షిక నూతన సంవత్సర కచేరీని 90 కి పైగా దేశాలకు ప్రసారం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు.
వియన్నా నగరవాసుల్లో దాదాపు సగం మంది సంగీత వాయిద్యం వాయించేవారు లేదా గాయక బృందంలో పాడేవారో అయి ఉంటారు.


