ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..
అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!
2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు.
ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్‌కి మరో ఛాన్స్‌లేదు.
పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్‌కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్‌ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.
అద్భుతం చేసిన ప్రేమ..
మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు.
దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్‌ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్‌కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది.
విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్‌కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్‌గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..!
మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!.


