శుక్ర గ్రహం స్వల్పంగా ధ్వంసం
భూమిని సైతం తాకనున్న సౌర ఉద్గారాలు
మనకు ఎలాంటి ముప్పు లేదంటున్న నిపుణులు
వాషింగ్టన్: సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతలి వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు(షాక్‌వేవ్స్) మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) ఢీకొట్టడంతో శుక్ర గ్రహం(వీనస్)లో స్వల్పభాగం దెబ్బతిన్నట్లు కనిపెట్టారు.
సౌర ఉద్గారం తదుపరి లక్ష్యం ఏమిటి? మన భూగోళమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకన్‌కు దాదాపు 2,474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్‌వేవ్స్ వెలువడినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు.
1972, 2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌరవ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లు అని కూడా అంటారు. భూమికి ఉన్నట్లుగా శుక్ర గ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్లు చెబుతున్నారు.
షాక్‌వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే, ఈ తరంగాలు మరింత విస్తరించి, భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్, అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్(ఎన్‌ఓఏఏ) నిపుణులు స్పష్టంచేశారు. సూర్యుడి అవతలి వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎలాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.


