సార్వభౌమ భారత్‌కు ఆ హక్కు ఉంది
స్పష్టం చేసిన రష్యా
మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడిచమరును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్‌ను చమురుకొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే.
విదేశీ వాణిజ్య విధానాలు, నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్ పూర్తిగా స్వీయనిర్ణయాలనే తీసుకుంటుంది. అందులో రష్యా వంటి మిత్రదేశాల పాత్ర ఉండబోదు. భారత్ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తుంది. ఆ స్వేచ్ఛ భారత్ ఎప్పుడూ ఉంటుంది’’అని పెస్కోవ్ అన్నారు. మీ వద్ద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లుచేస్తున్న నేపథ్యంలో భారతవైఖరి మారిందా? అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు.
‘‘భారత్ అనేది తన ఆర్థిక ప్రయోజనాలకే మొదట్నుంచీ పెద్దపీట వేస్తోంది. ఇకమీదట సైతం భారత్‌లోని మా చమురుభాగస్వాములు అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నాం’’అని అన్నారు. వద్దని వారించినా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాల భారం పడేసిన విషయం విదితమే.
2022లో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో క్రూడ్‌ఆయిల్‌ను కొంటున్న దేశాల్లో భారత్ సైతం ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. అయితే ఇటీవలకాలంలో పశ్చిమదేశాల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లలో తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే కథనలు వెలువడ్డాయి. ‘‘మాకు అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది. మా నుంచే భారత్ కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆంక్షల ఛత్రం నుంచి ఒడుపుగా తప్పించుకుంటూనే భారత్‌కు ఆయిల్ సరఫరాచేసే నైపుణ్యాలు మాకు ఉన్నాయి’’అని క్రెమ్లిన్ ఆర్థిక సలహాదారు మాక్సిమ్ ఒరెష్కిన్ ‘ఛానల్1’ఇంటర్వ్యూలో చెప్పారు.


