దేశంలో పొగరాయుళ్లకు ఖర్చు మరింత పెరగనుంది. పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు), పాన్ మసాలాపై జీఎస్టీ, పరిహారం సెస్, ఆరోగ్య సుంకాలు పెంచనున్నట్లు ఇదివరకే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఫిబ్రవరి 1 నుంచి వాటిని అమలు చేయనున్నట్లు నోటిఫై చేసింది.
ప్రస్తుతం సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ, వివిధ రేట్లతో పరిహార సెస్ వసూలు చేస్తున్నారు. 2017 జూలైలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి సిగరెట్లపై పన్నులు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, అంతకు మించి ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, ఎక్సైజ్ సుంకం అమలుకానున్నాయి. ఇక బీడీల విషయానికి వస్తే 18 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుంది.
పొగాకు ఉత్పత్తుల కోసం కొత్త ఎంఆర్‌పీ ఆధారిత వాల్యుయేషన్ మెకానిజంను ప్రవేశపెట్టారు. అంటే ఉత్పత్తి ప్యాకేజీపై పేర్కొన్న రిటైల్ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్టీని నిర్ణయిస్తారు. ఇక గుట్కాపై 91 శాతం, నమిలే పొగాకుపై 82 శాతం, జార్దా ఘాటు పొగాకుపై 82 శాతం అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు.
సిగరెట్లపై జీఎస్టీ, సుంకాలు ఇలా..
ఇప్పటి వరకు, సిగరెట్లపై ప్రధానంగా జీఎస్టీ, విలువ ఆధారిత లెవీ ద్వారా పన్ను విధించేవాళ్లు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ఈ కింది ప్రమాణాలను బట్టి 1,000 సిగరెట్లరకు రూ .2,050 నుండి రూ .8,500 వరకు పన్ను విధించనున్నారు.
65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న నాన్ ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ .2.05 పెరుగుదలను చూస్తుంది.
65 మిమీ వరకు ఉండే ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ.2.10 పెరుగుతుంది.
మీడియం పొడవు (65 నుంచి 70 మిల్లీమీటర్లు) సిగరెట్ల ధర రూ.3.6 నుంచి రూ.4 వరకు పెరుగుతుంది.
70 నుండి 75 మిమీ పొడవు ఉన్న పొడవైన, ప్రీమియం సిగరెట్ల ధర సుమారు రూ .5.4 పెరుగుదలను చూస్తుంది.


