డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్‌ ఏం చేయాలంటే.. | why tech cos choosing India for data centers pros and cons | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్‌ ఏం చేయాలంటే..

Nov 19 2025 7:57 PM | Updated on Nov 19 2025 8:05 PM

why tech cos choosing India for data centers pros and cons

సముద్ర గర్భంలో కేబుళ్ల ద్వారా నిమిషాల వ్యవధిలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ప్రపంచం నలుమూలలా చేరవేసే శక్తిమంతమైన కేంద్రాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. అవే డేటా సెంటర్లు. డేటా సెంటర్లు డిజిటల్ స్టోరేజ్‌ కోసం ప్రాసెసింగ్ హౌస్‌లుగా పని చేస్తాయి. మనం ఆన్‌లైన్‌లో చేసే ప్రతి పనికి (ఉదాహరణకు, గూగుల్‌లో శోధించడం, యూట్యూబ్ వీడియో చూడటం, జీమెయిల్ పంపడం, ఫొటోను క్లౌడ్‌లో సేవ్ చేయడం లేదా ఆన్‌లైన్ గేమ్‌ ఆడటం) మూల కారణం డేటా సెంటర్లే. ఈ విభాగంలో టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని భారత్‌పై కేంద్రీకరించాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇదొకవైపు డిజిటల్ ఇండియాకు శుభపరిణామం అయినప్పటికీ, మరోవైపు దేశ ఇంధన భవిష్యత్తుకు పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే వాదనలున్నాయి.

భారత్‌ ఎందుకు?

భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్‌గా ఉంది. కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు, పెరుగుతున్న 5జీ విస్తరణ, యూపీఐ లావాదేవీలు, ఓటీటీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డేటా డిమాండ్‌ను తీర్చాలంటే వినియోగదారులకు తక్కువ లేటెన్సీ అంటే వేగవంతమైన సేవలు కల్పించాలంటే డేటా సర్వర్లు భౌగోళికంగా వారికి చేరువలో ఉండాలి.

భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం దేశానికి సంబంధించిన సున్నిత డేటాను దేశ సరిహద్దుల్లోనే నిల్వ చేయాలని అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీలకు దేశంలోనే డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధపడేలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సులభతరమైన అనుమతులు కల్పిస్తున్నాయి. భారత్‌లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత ఇందుకు సానుకూల అంశంగా ఉంది.

డేటా సెంటర్లకు ఎంత విద్యుత్ కావాలంటే..

డేటా సెంటర్లకు తరచుగా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి కారణం వాటిలో నిరంతరం 24/7 పనిచేసే వేలాది సర్వర్లు (కంప్యూటర్లు) ఉంటాయి. డేటాను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం వంటి నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి సర్వర్‌కు గణనీయమైన విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో సర్వర్లన్నీ అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వేడి పెరిగితే సర్వర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, సర్వర్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి భారీ స్థాయిలో కూలింగ్‌ వ్యవస్థలు పనిచేయాలి. నివేదికల ప్రకారం, ఒక డేటా సెంటర్‌లోని మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వరకు కేవలం కూలింగ్ కోసమే ఖర్చు అవుతుంది.

ఉష్ణోగ్రత నియంత్రణ ఎలా?

  • సర్వర్లలో ఉత్పత్తి అయ్యే అధిక వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ రూమ్ ఎయిర్ కండిషనింగ్/హ్యాండ్లర్ యూనిట్లను ఉపయోగించి సర్వర్ల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తారు. ఇది అత్యంత సాధారణ పద్ధతి.

  • నీటిని ఆవిరి చేసి దాని ద్వారా ఉత్పత్తయ్యే చల్లదనాన్ని ఉపయోగించి వేడి గాలిని చల్లబరచడం ఇంకోపద్ధతి. వేడి వాతావరణం ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మెరుగైన మార్గం అవుతుంది.

  • లిక్విడ్ కూలింగ్ అనేది ఆధునిక పద్ధతి. సర్వర్ చిప్‌లకు నేరుగా ప్రత్యేకమైన ద్రవాలను పంపడం ద్వారా వేడిని తొలగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చాలా కంపెనీలు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడి నీటిని సమీపంలోని పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారు.

ఇంధన సవాళ్లు..

భారతదేశం 2070 నాటికి ‘నికర-శూన్య కర్బన ఉద్గారాల (Net-Zero Emissions)’ లక్ష్యాన్ని సాధించాలని, 2030 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% పునరుత్పాదక వనరుల నుంచి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ప్రస్తుతం అధిక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం థర్మల్ విద్యుత్ (బొగ్గు). డేటా సెంటర్ల కోసం విపరీతంగా పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ థర్మల్ విద్యుత్‌పై ఆధారపడాల్సి వస్తే అది మన పునరుత్పాదక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

భారత్ ఎంచుకోవాల్సిన పంథా..

ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక సమగ్రమైన, పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరించాలి. భారత ప్రభుత్వం ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. డేటా సెంటర్ ఆపరేటర్లు తమకు అవసరమైన విద్యుత్‌లో కనీసం 60% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందాలని (ఉదాహరణకు, సోలార్ లేదా విండ్ పవర్ ప్లాంట్‌లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) తప్పనిసరి చేయాలి. విద్యుత్ వినియోగ సమర్థత (Power Usage Effectiveness) వంటి పారామితుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

లిక్విడ్ కూలింగ్, నేచురల్ ఎయిర్ కూలింగ్ (చల్లని ప్రాంతాల్లో) వంటి అత్యంత సమర్థవంతమైన కూలింగ్‌ సాంకేతికతలను ఉపయోగించే డేటా సెంటర్లకు అధిక రాయితీలు ఇవ్వాలి. విద్యుత్‌ను వృథా చేసే వ్యవస్థలకు బదులుగా ఆధునిక, పర్యావరణ అనుకూల యంత్రాలను ఉపయోగిస్తే కొన్ని రాయితీలు పరిశీలించవచ్చు. సౌర, పవన విద్యుత్ నిరంతరంగా లభించదు. కాబట్టి, ఈ విద్యుత్‌ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలి. ఇది డేటా సెంటర్లకు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయడానికి దోహదపడుతుంది.

ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement