తక్కువ సమయంలో సుదూర గమ్యాలకు చేరుకొనే వీలు, ప్రయాణ సౌకర్యం ఉంటుందనే భావనతో విమానయానానికి మొగ్గుచూపడం సర్వసాధారణం. కానీ, కొద్దికాలంగా విమాన యానమంటే ఎన్నడూ లేనంత అనిశ్చితి నెలకొనడం విడ్డూరం. విమాన సర్వీసుల్లో విపరీతమైన జాప్యాలు, ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సర్వీసు రద్దవడాలు, ఎప్పుడు ఎలా చేరతామో తెలియని దుఃస్థితి వగైరా దేశీయంగా ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి. తాజాగా ‘ఇండిగో’ విమానసేవల్లో నెలకొన్న సంక్షోభం దేశీయ విమానయాన రంగంలోని అనేక లోపాలకు అద్దం పడుతోంది. తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఇప్పుడేం జరిగింది?
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిర్వహణపరమైన సంక్షోభంలో చిక్కు కున్నాయి. ఒక్క డిసెంబర్ తొలి వారంలోనే కనీసం మూడు రోజులుగా కొన్ని వందల సంఖ్యలో ఫ్లైట్లు ఆఖరి నిమిషంలో రద్దయ్యాయి. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో గంటలు, పూటలకొద్దీ జాప్యాలతో లక్షలాది ప్రయా ణికులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. అత్యవ సర పనుల మీదున్న జనం ఈ అంతులేని ప్రయాణ కష్టాలతో ఆగ్రహించారు. చివరకు కనివిని ఎరుగని ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవి యేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేప ట్టింది. సంక్షోభ కారణాలను వివరించాలనీ, విమాన సర్వీసులను చక్కదిద్దేందుకు అత్యవసర ప్రణాళికను అందజేయా లనీ ఇండిగోను గురువారం ఆదేశించింది.
ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?
అధికారిక గణాంకాల ప్రకారం ఇండిగో దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45కి పైగా గమ్యస్థానా లకు ప్రయాణికులను చేరుస్తోంది. దాదాపు 400 పైచిలుకు విమానాలు దానికున్నాయి. రోజూ 2300కి పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 11.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 2024లో కొత్తగా 58 విమానాల్ని కూడా సమకూర్చుకుంది. అయితే, విమానయానం పెరుగుతున్న సమయంలో ఇది ఏ మాత్రం సరి పోదు. పైగా పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా తగినంతమంది పైలట్లూ లేరు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ మాటల్లో చెప్పాలంటే, సిబ్బంది కొరత వల్లే ఈ జాప్యాలు, సర్వీసుల రద్దు లాంటి వన్నీ! ఎమిరేట్స్ ఈ వారంలోనే పెద్దయెత్తున నియా మకాలు చేపట్టడంతో ఇండిగోకు కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బంది కూడా తీవ్రంగా కొరవడినట్టు భోగట్టా.
కొత్త షరతులతో తలనొప్పి?
లోతుకు వెళితే, వైమానిక డ్యూటీ సమయ పరిమితి (ఎఫ్డీటీఎల్)కి సంబంధించిన నిబంధనలు మారాయి. వాటిలో తొలి విడత జూలై 1 నుంచి, రెండో విడతవి నవంబర్1 నుంచి అమలయ్యాయి. పైలట్ల విశ్రాంతి, నైట్‌డ్యూటీ రూల్స్ కట్టుదిట్టమయ్యాయి. పైలట్లకు ఏకబిగిన 48 గంటల విరామమివ్వాలి, వరుసగా 2 నైట్ డ్యూటీలు మించకూడదు. వీటి వల్ల, అడిగిన వెంటనే సిబ్బంది అందుబాటులో ఉండే పాత రోజులు పోయాయి. అలాగే, చలికాలంలో సాంకేతి కంగా ఉండే చిన్న చిన్న చిక్కులు, ప్రతికూల వాతా వరణాలు, ప్రయాణాల సీజన్ కావడంతో ఉండే రద్దీ లాంటివన్నీ కలసి తలకు మించిన భారమయ్యాయి.
ఒక్క నవంబర్‌లోనే ఇండిగో 1232 సర్వీసులు రద్దు చేసింది. ఇందులో 62 శాతం దాకా చిక్కులకు సిబ్బంది కొరత, ఎఫ్డీటీఎల్ షరతులే కారణం. వంద లాది సర్వీసులు రద్దవడంతో ఆ సంస్థ షేర్లు కూడా 3 శాతం పైగా పడిపోవడం గమనార్హం. మన దేశీయ విమానయాన మార్కెట్‌లో దాదాపు 65 శాతం వాటా ఇండిగోదే కావడంతో సర్వీసులో రద్దుతో ఒక్క సారిగా టికెట్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి.
ఇకపై ఏం చేయాలి?
ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్యలతో ఎయిర్ బస్‌లు స్తంభించాయి. ఇప్పుడీ ఇండిగో సమస్య. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగున్న విమాన యాన మార్కెట్ మనది. పెరుగుతున్న ఆ డిమాండ్‌కు తగ్గట్టు పైలట్లు లేరు. వచ్చే దశాబ్ద కాలంలో మనకు 30 వేల మంది కొత్త పైలట్లు కావాలి. కానీ, అందుకు తగ్గ ప్రాథమిక వసతులు, శిక్షణ సౌకర్యం, నిధులు కరవే.
ఇకనైనా మరోసారి ఇలాంటి సంక్షో భాలు తలెత్తకూడదంటే, అదనపు సిబ్బంది అందు బాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం. తక్కువ సిబ్బంది, తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చి ఆలోచనతో పెనాల్టీల పాలై, పేరు పోగొట్టుకునే కన్నా అది మేలు. ఖర్చు గిట్టు బాటయ్యేలా చూసుకుంటూనే నిర్వహణ సామర్థ్యం బలోపేతం చేసుకొని, సమతూకం పాటించడం అత్యవసరమన్నది తాజా ఉదంతం అన్ని ఎయిర్ లైన్స్‌కూ నేర్పుతున్న పాఠం. నేర్చుకోకపోతే ఈ కష్టాల సీరియల్ కొనసాగక మానదు.


