సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్‌జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంధన రసాయన నిర్మాణం
పెట్రోల్ అనేది C8H18 వంటి హైడ్రోకార్బన్‌ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
ఎయిర్ ఫ్యూయెల్ రేషియో
సీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.
ఎనర్జీ కంటెంట్
పెట్రోల్‌లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.
వేడి నష్టం తక్కువ
CNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.
మైలేజ్
సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.
మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు.


