
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనే వాదనలు నిజం కాదని, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మైలేజీపై E20 పెట్రోల్ ప్రభావం అనే ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.
''ప్రపంచంలో ఎక్కడైనా E20 పెట్రోల్ కారణంగా సమస్యలు ఎదుర్కొన్న ఒక వాహనాన్ని మీరు నాకు చూపించండి'' అని బహిరంగంగా సవాలు విసిరారు. ఇంధనం కారణంగా ఇంజిన్‌కు పెద్దగా నష్టం జరగదు. అయితే కొత్త కార్లలో మైలేజ్ 2 శాతం, అప్‌గ్రేడ్ చేసిన విడి భాగాలను ఉపయోగించిన కార్ల మైలేజ్ 6 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది సర్వ సాధారణం అని చెప్పవచ్చు. దీనిని సమస్యగా పరిగణించలేము.
స్థానికంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ వాడకం వల్ల, భారతదేశానికి పెట్రోల్ దిగుమతి ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా ఈ ఇంధనం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,200 నుంచి రూ.2,600 ఉంటుంది. దీని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. కాబట్టి ఇంధన ధరలు కొంత తగ్గుతాయని అన్నారు.
ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం మూడు రెట్లు పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విధంగా వైవిధ్యపరచడం వల్ల జీడీపీలో వ్యవసాయ వాటా ప్రస్తుత 12 శాతం నుండి 22 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 'ఇథనాల్'ను 100 శాతం ఇంధనంగా ఉపయోగించనున్నట్లు ప్రకటించారు.