2026 జనవరిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కియా, మారుతి సుజుకి, మహీంద్రా, రెనాల్ట్, స్కోడా కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కియా సెల్టోస్
సెకండ్ జనరేషన్ సెల్టోస్ కారును.. కియా కంపెనీ జనవరి 2న లాంచ్ చేయనుంది. అంటే.. ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ కారు ధరలను ఆరోజు అధికారికంగా వెల్లడిస్తారన్నమాట. ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.
మారుతి సుజుకి ఈ విటారా
మారుతి సుజుకి ఈ విటారాతో.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇది 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్‌డేట్‌లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే యాంత్రికంగా, పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారు
రెనాల్ట్ డస్టర్
న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్.. జనవరిలో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో ఒకటి. CMF-B ప్లాట్‌ఫామ్ ఆధారంగా, కొత్త డిజైన్ పొందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని సమాచారం.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్
అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్‌లు, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.


