పెట్రోల్‌లో 20% ఇథనాల్ మిశ్రమం (ఈ20) కార్యక్రమంలో భారత్ సక్సెస్
ఈ20లో లక్ష్యాన్ని అయిదేళ్ల ముందుగానే అందుకున్న వైనం
తదుపరి టార్గెట్ పెట్రోల్‌లో 25% ఇథనాల్ కలిపే కార్యక్రమం.. భారీగా ఆదా అవుతున్న విదేశీ మారక నిల్వలు
సాక్షి, స్పెషల్ డెస్క్: పెట్రోల్‌లో ఇథనాల్ వాటా మన దేశంలో అక్టోబర్ నాటికి 19.97% వచ్చి చేరింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం గడువు కంటే ముందుగా భారత్ లో సక్సెస్ అయింది. ఈ ఊపుతో కేంద్ర పెట్రో లియం మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ25 లక్ష్యానికి కొన్ని నెలల్లోనే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా దశలవారీగా ఈ27, ఈ30 కార్యక్రమం సైతం పూర్తవుతుందని ధీమాగా ఉంది.
ఈబీపీ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి ఈ20 (పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 20%) సాధించాలని ప్రభుత్వం గతంలో లక్ష్యం విధించుకుంది. కానీ గడువు కంటే వేగంగా.. అది కూడా పదేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జోష్ తెచ్చింది. తదుపరి ఈ25 (పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 25%) నిబంధన అమలు దిశగా పావులు కదుపుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశ ఇథనాల్ ప్రయాణం ఆపలేనిదని కొన్ని రోజుల క్రితం పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. ఇథనాల్‌కు హామీ ధర నిర్ణయించడం, తయారీకి బహుళ ముడిపదార్థాలను అనుమతించడం, దేశవ్యాప్తంగా డిస్టిలేషన్ సామర్థ్యం పెంచడం వంటి స్థిరమైన విధాన సంస్కరణల ద్వారా ఈ విజయం సాధ్యమైందని ప్రభుత్వం చెబుతోంది. బీఐఎస్ ప్రమాణాలు, ఆర్థిక ప్రోత్సాహకాల మద్దతుతో దశలవారీగా ఈ25, ఈ27, ఈ30 వైపు భారత్ మళ్లుతుందని స్పష్టం చేస్తోంది.
ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
వాస్తవానికి 2022 నవంబర్ నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 10.02% మాత్రమే. మూడేళ్లలోనే ఈ వాటా రెండింతలు అయిందంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 2014లో కేవలం 1.53% మాత్రమే. ఈబీపీ కారణంగా భారత్‌కు ముడి చమురు దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున అదా అవుతుండడంతోపాటు స్థిరమైన ఇంధన వినియోగం దిశగా ఈ కార్యక్రమం ఒక పెద్ద ముందడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జీవ ఇంధనం వాడటంతో ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకుపైగా ఆదా కావడం విశేషం. ఈ20 సాధించేందుకు బ్రెజిల్‌కు 20 ఏళ్లు పట్టిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల టెండర్ల ప్రకారం 2025–26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికిగాను మన దేశంలో డిమాండ్‌ను మించి ఇథనాల్ సప్లై ఉంది.
మొత్తం డిమాండ్: 1,350 కోట్ల లీటర్లు (ఈబీపీ కోసం 1,050 కోట్ల లీటర్లతో సహా).
సరఫరా: 1,775 కోట్ల లీటర్లు.
ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం: 1,900 కోట్ల లీటర్లు.



