లేటెస్ట్ టెక్నాలజీతో భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేస్తున్న స్వదేశీ మ్యాపింగ్ దిగ్గజం మ్యాప్‌మైఇండియా తన 'మ్యాపల్స్'(Mappls) యాప్‌లో మార్పులు చేపట్టింది. నగర ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని మెట్రో, రైలు, బస్సు రూట్లను ఏకీకృతం చేస్తూ ‘మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
సమగ్ర మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా..
ప్రస్తుతం 40 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న మ్యాప్ల్స్ యాప్.. ఇప్పుడు కేవలం ప్రైవేట్ వాహనాలకే పరిమితం కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సమాచారాన్ని కూడా ఒకే చోట అందిస్తుంది. వినియోగదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, బస్సు సర్వీసుల రూట్లు, స్టాపులు, ఇంటర్‌చేంజ్ (మారే ప్రదేశాలు) ఆప్షన్లను సులభంగా చూడవచ్చు.
అందుబాటులో ఉన్న నగరాలు..
ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాతో పాటు.. పుణె, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, భోపాల్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, నాగ్‌పూర్, ఇండోర్, పట్నా, చండీగఢ్‌ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, వెబ్ వెర్షన్లలో లైవ్‌లో ఉందని పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా..
ఈ సందర్భంగా మ్యాప్‌మైఇండియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మా మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను గుర్తించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను రోజువారీ నావిగేషన్‌లో చేర్చాం దీని ద్వారా నగరాల్లో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. ఈ కొత్త ఫీచర్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. దీని ద్వారా రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గుతుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, సేఫ్టీ అలర్ట్స్‌తో ప్రయాణ సమయం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది.


