ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా ఉండాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన ‘ఆర్ యూ డెడ్?’ (Are You Dead?) అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.
ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా నిలిచింది. ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతోంది. ఈ యాప్‌లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్ యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్‌ను ఓపెన్ చేసి, తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్‌పై కనిపించే బటన్‌ను నొక్కాలి.
ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నంబర్‌కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి సన్నిహితులు గ్రహించి, వెంటనే స్పందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్, ప్రస్తుతం 8 యువాన్ల (సుమారు రూ. 95) ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా ఈ యాప్ ఆదరణం పొందుతోంది. ఈ యాప్ పేరు ‘ఆర్ యూ డెడ్?’ (మీరు చనిపోయారా?) అని ఉండటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ‘ఆర్ యూ అలైవ్?’ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి


