ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 2026, ఫిబ్రవరి 12న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో, తమకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ దేశంలోని మైనారిటీ సంఘాలు ఎన్నికల సంఘాన్ని (ఈసీ)కోరాయి. తాజాగా ఫెనీ జిల్లాలో సమీర్ దాస్(28) అనే హిందూ యువకుడిని దుండగులు దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి హత్య చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్య వేదిక ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి, హిందూ ఓటర్లకు తగిన భద్రత కల్పిస్తూ, ఎన్నికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని, దీంతో ఓటు వేయాలంటే భయం కలుగుతోందని మైనారిటీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సంఘంతో జరిగిన భేటీలో, హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. భయం నీడలో ఓటు వేయడం సాధ్యం కాదని, హింసను నివారించడానికి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కేటాయించాలని వారు కోరారు. గత డిసెంబర్ నెలలోనే మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించి దాదాపు 51 కేసులు నమోదైనట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు మరింతగా పెరిగాయి. ఫెనీ జిల్లాలో సమీర్ దాస్ హత్యకు గురికాగా, అంతకుముందు జెస్సోర్ జిల్లాలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యాపారిని కాల్చి చంపారు. నర్సింగ్దీ జిల్లాలో శరత్ మణి చక్రవర్తి అనే కిరాణా షాపు యజమాని కూడా దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా దాడులు మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని మైనారిటీ సంఘాలు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. సమీర్ దాస్ హత్యను ఖండించిన బీజేపీ నేత అమిత్ మాలవీయ.. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ దాడులను కల్పితం అని ప్రభుత్వం కొట్టిపారేయడం విచారకరమని సీనియర్ పాత్రికేయుడు కాంచన్ గుప్తా పేర్కొన్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ హింసపై మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇది కూడా చదవండి: అయోధ్య నుండి పూరి.. ఐఆర్సీటీసీ గోల్డెన్ ఆఫర్


