
కొన్నేళ్ళకు ముందు పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. పరిస్థితులు మార్పులు.. ఉద్గారప్రమాణాలు అమలులోకి రావడం వల్ల.. డీజిల్ కార్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెట్రోల్ కార్లు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్‌జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. కార్ల కొనుగోలు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ కథనంలో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇంధన రకానికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.
పెట్రోల్ కార్లు
మీరు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లయితే.. ఇందులో విభిన్న ధరల వద్ద కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లు ఇతర కార్లతో పోలిస్తే కొంత తక్కువ ధర వద్ద లభిస్తాయి. అంతే కాకుండా దేశంలో పెట్రోల్ పంపులు కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, దూర ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

డీజిల్ కార్లు
డీజిల్ కార్లు ఒకప్పుడు విరివిగా అందుబాటులో ఉండేవి. బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వంటి నగరాల్లో పాత డీజిల్ కార్లను కొన్నాళ్ళు నిషేధించారు. భవిష్యత్తులో డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా కంపెనీలు బాగా తగ్గించే అవకాశం ఉంది. డీజిల్ కార్ల ధరలు కూడా పెట్రోల్ కార్ల ధరల కంటే ఎక్కువ. వీటిని కూడా రోజువారీ వినియోగనికి, దూర ప్రయాణాలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కార్లు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం.. ఈవీలపై జీఎస్టీ తగ్గింపు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ అందించింది. అయితే ఇప్పుడు ఈవీల వినియోగానికి ప్రధాన సమస్య.. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే. వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. నగర ప్రయాణాల కోసం ఈవీలను ఎంచుకోవచ్చు. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించాలనుకుంటే మాత్రం ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదీ చదవండి: జనరల్ మేనేజర్‌కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓ
సీఎన్‌జీ కార్లు
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే.. సీఎన్‌జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ కార్లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో సీఎన్‌జీ రీఫ్యూయలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కంపెనీలు తమ సీఎన్‌జీ కార్లలో మంచి బూట్ స్పేస్ కూడా అందిస్తున్నాయి. ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.
హైబ్రిడ్ కార్లు
భారతదేశంలో ప్రస్తుతం మైల్డ్ హైబ్రిడ్ కార్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా 10 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తాయి. అంతే కాకుండా ఇవి కాలుష్య కారకాలను కూడా తక్కువగానే విడుదల చేస్తాయి. వీటి ధరలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి.