వంటనూనెల పంటలతో పోలిస్తే అయిదు రెట్లు అధిక దిగుబడి, దాదాపు 30 ఏళ్ల వరకు ఉత్పాదకత ఉండే ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (ఆయిల్ పామ్ బిజినెస్) సౌగత నియోగి తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు, ధరలకు హామీ, ప్రోత్సాహకాలను ఇస్తుండటం తదితర చర్యలు దీనికి సానుకూలంగా ఉంటున్నాయని చెప్పారు.
దీనికి సంబంధించిన జాతీయ మిషన్ కింద 2019–20లో 3.5 లక్షల హెక్టార్లుగా ఉన్న ఆయిల్ పామ్ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచుకోవాలని లక్ష్యాలు ఉన్నాయని నియోగి తెలిపారు. అయితే, గతేడాది నవంబర్ నాటికి ఇది లక్ష్యానికన్నా తక్కువగా 6.20 లక్షల హెక్టార్లకు మాత్రమే చేరినప్పటికీ, సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుండటం సానుకూల అంశమన్నారు.
విస్తరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, పర్యావరణహితమైన సాగు విధానాల్లాంటివి అమలైతే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నియోగి చెప్పారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన, లాభదాయకమైన పంటగానే కాకుండా దేశీయంగా వంటనూనెల భద్రత సాధనకు కూడా ఉపయోగపడగలదని వివరించారు.


