పొలం పంటల కన్నా.. ఇంటి పంటలే బెట‌రా? | Advantages of outdoor farming over indoor farming explainer sagubadi | Sakshi
Sakshi News home page

పొలం పంటల కన్నా ఇంటి పంటలతో ప్రయోజనాలున్నాయా?

Sep 11 2025 6:22 PM | Updated on Sep 11 2025 6:46 PM

Advantages of outdoor farming over indoor farming explainer sagubadi

పంటలు అనగానే మనకు ఆరుబయట పొలంలో పండించే పంటలే (అవుట్‌డోర్‌ ఫార్మింగ్‌) గుర్తుకొస్తాయి. కానీ, ఆధునిక కాలంలో ఇండోర్‌ పంటలా (ఇంటి పంటలా), అవుట్‌డోర్‌ పంటలా అని వివరణ అడగాల్సిన పరిస్థితి. మేడపైన ఇంటి పంటలు, పెరటి తోటలు, వర్టికల్‌ గార్డెన్స్, పాలీహౌస్‌ పంటలు.. ఇలా అనేక రకాలుగా ఇవ్వాళ పంటలు పండించుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ఆరుబయట అనుకూలంగా లేనప్పుడు పాలీహౌస్‌లు, భవంతుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించి మరీ సాగు చేస్తున్నాం. రూరల్‌ అగ్రికల్చర్, అర్బన్‌ అగ్రికల్చర్‌గా కూడా విడమర్చి మాట్లాడుకుంటున్నాం. 

అయితే, ఇండోర్‌ ఫార్మింగ్‌లో (Indoor Farming) చాలా విషయాలను మనం నియంత్రించగలం కాబట్టి ఆరుబయట సాగుతో పోల్చితే అన్నీ మెరుగ్గానే ఉంటాయన్న గ్యారంటీ ఏమీలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడా ఉంటాయి. అయితే, ఇండోర్‌ ఫార్మింగ్‌ పద్ధతుల్లో ఏయే ఆహార భద్రతా చిక్కులొస్తాయి? సాధారణ వ్యవసాయానికి దీనికీ ఏమి తేడాలుంటాయి? అనే అంశంపై చర్చ చాలాకాలంగానే ఉన్నప్పటికీ అధ్యయనాల, ప్రమాణాల లోపం వెంటాడుతూ ఉంది. ఈ కొరత తీర్చడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్‌ ఎఫ్‌ఏవో) ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. ఆరుబయట పంటలు పండించటంతో పోల్చితే ఇంట్లో పండించే పంటలతో ప్రయోజనాలేమి ఉన్నాయి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను ఆ నివేదికలో చర్చించారు. వాటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం..

ఆధునిక ఇండోర్‌ వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత (Food Security) ప్రమాదాలు, నియంత్రణలపై మొట్టమొదటి సమగ్ర సమీక్షా నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నివేదికలో సాకల్యంగా చర్చించింది. ఇండోర్‌ వ్యవసాయం లేదా నియంత్రిత పర్యావరణ వ్యవసాయం (కంట్రోల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అగ్రికల్చర్‌ – సీఈఏ) వల్ల ఒనగూడే ప్రయోజనాలు అనేకం. స్థిరత్వంతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, వాతావరణ మార్పులకు అనుకూలత, ఆహార భద్రతను మెరుగుపరచడం వంటివాటిని ఎఫ్‌ఏవో ఈ జాబితాలో చేర్చింది.

ప్రస్తుత రోజుల్లో, సాంప్రదాయకంగా ఆరుబయట పండించే ఆకుకూరలతో పాటు మైక్రోగ్రీన్, బేబీ లీఫ్‌ వంటి స్వల్పకాలిక పంటల ఇండోర్‌ వ్యవసాయమే వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు ముఖ్యంగా సంపన్న చలి ప్రాంత పాశ్చాత్య, ఐరోపా దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే.. మన దేశంలో ఇండోర్‌ వ్యవసాయం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ పరిమితిలోనే ఈ నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం.

ఏ వ్యవసాయమైనా ఆరోగ్యదాయకమైన, రోగకారకం కాని భద్రమైన ఆహారోత్పత్తే లక్ష్యంగా సాగుతుంది. అయితే, సాంప్రదాయ వ్యవసాయం కంటే ఇండోర్‌ వ్యవసాయమే సులభంగా నిర్వహించదగిన ఆహార భద్రత ప్రమాదాలతో కూడి ఉంటుందని తరచుగా భావిస్తుంటారు. అయితే, ఇండోర్‌ పంటలకు సంబంధించిన ఆహార భద్రత సమస్యలు సాధారణంగా సాంప్రదాయ బహిరంగ వ్యవసాయంలో కనిపించే సమస్యల అంతటి తీవ్రంగానే ఉంటాయని ఎఫ్‌ఏవో నివేదిక (FAO Report) నొక్కి చెబుతోంది. విత్తనాలు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, నీటికి సంబంధించి సూక్ష్మక్రిములతో కూడిన కాలుష్య ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మొలకల ఉత్పత్తిలోనూ సమస్య రావచ్చు.

బహిరంగ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఇండోర్‌ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని అనియంత్రిత కాలుష్య సమస్యలు ఉండవు. బహిరంగ వాతావరణంలో సూక్ష్మక్రిముల పోటీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, ఎండ సోకటం వల్ల కొన్ని సహజ వ్యాధికారకాలు నశిస్తాయి. ఇండోర్‌ వ్యవసాయంలో వ్యాధికారకాలు ఎక్కువ కాలం సమస్యను సృష్టించే వీలుంటుంది. ఇందులో విత్తనాలు, నీరు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, ఎరువులు వంటి ఉత్పాదకాల జీవ భద్రతపై నియంత్రణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఇండోర్‌ వ్యవసాయంలో అధిక తేమ, నీటి ఆధారిత వ్యవస్థలు వాడతాం కాబట్టి సూక్ష్మక్రిములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇండోర్‌ వ్యవసాయంలో సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ప్రమాదాలు రసాయనాలతో వచ్చే ప్రమాదాల కంటే చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ, పర్యావరణ కాలుష్యం, పొలాస్టిక్‌ పరికరాల సంబంధిత పదార్థాల నుంచి వెలువడే కాలుష్యం వంటి రసాయన సమస్యలను కూడా నివేదిక పేర్కొంది.

ఆర్థిక పోటీకి నిలబడితేనే భవిష్యత్తు
‘ఇండోర్‌ వ్యవసాయం వాతావరణ మార్పుల్ని తట్టుకొని స్థిరమైన దిగుబడినిచ్చే విషయంలో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ సామర్థ్యాన్ని ఆచరణలో నిజం చేయడానికి బలమైన ఆహార భద్రతా పద్ధతులు, పర్యవేక్షణ చాలా అవసరం’ అని ఎఫ్‌ఏవో నివేదిక రూపుకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆహార భద్రతా అధికారి మసామి టకేచి అన్నారు.

‘సాంప్రదాయ పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని వెలువరించగలిగే విషయంలో ఆర్థికంగా పోటీకి నిలవగలగడమే ఇండోర్‌ వ్యవసాయం విజయానికి కీలకం’ అని డాక్టర్‌ కీత్‌ వారినర్‌ అన్నారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలోని గ్వెల్ఫ్‌ విశ్వవిద్యాలయ నిపుణుల్లో కీత్‌ ఒకరు. ‘అదే సమయంలో, ఇండోర్‌ పొలాల లోపల నియంత్రిత వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవి లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలి. అప్రమత్తతకు నవీన ఆవిష్కరణలు తోడైతే ఇండోర్‌ వ్యవసాయం సురక్షితంగా, స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది..’ అని డా. కీత్‌ వివరించారు.

‘ఇండోర్‌ ఫార్మింగ్‌’కు పేర్లెన్నో!?
ఇండోర్‌ వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు. ‘రక్షిత వ్యవసాయం‘ అనే పదంతో ‘ఇండోర్‌ ఫార్మింగ్‌’ను 13వ శతాబ్దంలో మొదటి సారి వాడారు. బయటి వాతావరణానికి దూరంగా ఉంచే సౌకర్యాల మధ్య పెరిగే మొక్కలనే అర్థంలో వాడారు. ఆ తర్వాత కాలంలో ‘ఇండోర్‌ వ్యవసాయం‘ అనే పదానికి ‘పట్టణ వ్యవసాయం‘, ‘మొక్కల కర్మాగారం‘, ‘గ్రీన్‌హౌస్‌‘, ‘హాట్‌హౌస్‌‘, ‘గ్లాస్‌హౌస్‌‘ వంటి అదనపు పదాలు తోడయ్యాయి. ఇవన్నీ పర్యాయపదాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులోని వివిధ పద్ధతులను, వాటి భాగాలను వివరించడానికి ఉపయోగించే పదాలను నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది.

పట్టణ వ్యవసాయం: నగరాలు, పట్టణ ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహారాన్ని పండించడం, ప్రాసెస్‌ చేయడం, పంపిణీ చేయడం.

ఇండోర్‌ వ్యవసాయం: ఆరుబయట కాకుండా మూసివున్న వాతావరణంలో పంటలను పెంచే ఏవైనా పద్ధతులు. ఒక గదిలో మొక్కలను పెంచే వ్యవసాయ వ్యవస్థను వివరించేందుకు వాడే పదం.

గ్రీన్‌హౌస్‌: గ్రీన్‌హౌస్‌ అనేది నియంత్రిత పర్యావరణ నిర్మాణం. ఇది ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పరిస్థితులను మారుస్తుంది. మొక్కల పెరుగుదలను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా సహజ వాతావరణ పరిస్థితులు తక్కువ అనుకూలంగా ఉన్న వాతావరణాలలో దీన్ని వాడతారు. గ్లాస్‌హౌస్, పాలీ వినైల్‌ క్లోరైడ్‌ గ్రీన్‌హౌస్, పాలిథిలిన్‌ గ్రీన్‌హౌస్‌ ఇవన్నీ దీనికి పర్యాయపదాలే.

చ‌ద‌వండి: ఒక్కసారి నాటు.. ఆరు సార్లు కోత‌లు

నియంత్రిత పర్యావరణ వ్యవసాయం: పట్టణ, పట్ణణాల చుట్టూ గలప్రాంతాల్లో ఆరుబయట, మట్టిలో గాని, మట్టిలేకుండా గాని చేసే వ్యవసాయం.

మొక్కల కర్మాగారం: కృత్రిమ/సహజ/సౌర కాంతిని ఉపయోగించి అధిక నాణ్యత గల పంటలను నిరంతరం ఉత్పత్తి చేసే భవనం.

– పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement