breaking news
Green House cultivation
-
పొలం పంటల కన్నా.. ఇంటి పంటలే బెటరా?
పంటలు అనగానే మనకు ఆరుబయట పొలంలో పండించే పంటలే (అవుట్డోర్ ఫార్మింగ్) గుర్తుకొస్తాయి. కానీ, ఆధునిక కాలంలో ఇండోర్ పంటలా (ఇంటి పంటలా), అవుట్డోర్ పంటలా అని వివరణ అడగాల్సిన పరిస్థితి. మేడపైన ఇంటి పంటలు, పెరటి తోటలు, వర్టికల్ గార్డెన్స్, పాలీహౌస్ పంటలు.. ఇలా అనేక రకాలుగా ఇవ్వాళ పంటలు పండించుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ఆరుబయట అనుకూలంగా లేనప్పుడు పాలీహౌస్‌లు, భవంతుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించి మరీ సాగు చేస్తున్నాం. రూరల్ అగ్రికల్చర్, అర్బన్ అగ్రికల్చర్‌గా కూడా విడమర్చి మాట్లాడుకుంటున్నాం. అయితే, ఇండోర్ ఫార్మింగ్‌లో (Indoor Farming) చాలా విషయాలను మనం నియంత్రించగలం కాబట్టి ఆరుబయట సాగుతో పోల్చితే అన్నీ మెరుగ్గానే ఉంటాయన్న గ్యారంటీ ఏమీలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడా ఉంటాయి. అయితే, ఇండోర్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఏయే ఆహార భద్రతా చిక్కులొస్తాయి? సాధారణ వ్యవసాయానికి దీనికీ ఏమి తేడాలుంటాయి? అనే అంశంపై చర్చ చాలాకాలంగానే ఉన్నప్పటికీ అధ్యయనాల, ప్రమాణాల లోపం వెంటాడుతూ ఉంది. ఈ కొరత తీర్చడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్ఏవో) ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. ఆరుబయట పంటలు పండించటంతో పోల్చితే ఇంట్లో పండించే పంటలతో ప్రయోజనాలేమి ఉన్నాయి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను ఆ నివేదికలో చర్చించారు. వాటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం..ఆధునిక ఇండోర్ వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత (Food Security) ప్రమాదాలు, నియంత్రణలపై మొట్టమొదటి సమగ్ర సమీక్షా నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నివేదికలో సాకల్యంగా చర్చించింది. ఇండోర్ వ్యవసాయం లేదా నియంత్రిత పర్యావరణ వ్యవసాయం (కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ – సీఈఏ) వల్ల ఒనగూడే ప్రయోజనాలు అనేకం. స్థిరత్వంతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, వాతావరణ మార్పులకు అనుకూలత, ఆహార భద్రతను మెరుగుపరచడం వంటివాటిని ఎఫ్ఏవో ఈ జాబితాలో చేర్చింది.ప్రస్తుత రోజుల్లో, సాంప్రదాయకంగా ఆరుబయట పండించే ఆకుకూరలతో పాటు మైక్రోగ్రీన్, బేబీ లీఫ్ వంటి స్వల్పకాలిక పంటల ఇండోర్ వ్యవసాయమే వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు ముఖ్యంగా సంపన్న చలి ప్రాంత పాశ్చాత్య, ఐరోపా దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే.. మన దేశంలో ఇండోర్ వ్యవసాయం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ పరిమితిలోనే ఈ నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం.ఏ వ్యవసాయమైనా ఆరోగ్యదాయకమైన, రోగకారకం కాని భద్రమైన ఆహారోత్పత్తే లక్ష్యంగా సాగుతుంది. అయితే, సాంప్రదాయ వ్యవసాయం కంటే ఇండోర్ వ్యవసాయమే సులభంగా నిర్వహించదగిన ఆహార భద్రత ప్రమాదాలతో కూడి ఉంటుందని తరచుగా భావిస్తుంటారు. అయితే, ఇండోర్ పంటలకు సంబంధించిన ఆహార భద్రత సమస్యలు సాధారణంగా సాంప్రదాయ బహిరంగ వ్యవసాయంలో కనిపించే సమస్యల అంతటి తీవ్రంగానే ఉంటాయని ఎఫ్ఏవో నివేదిక (FAO Report) నొక్కి చెబుతోంది. విత్తనాలు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, నీటికి సంబంధించి సూక్ష్మక్రిములతో కూడిన కాలుష్య ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మొలకల ఉత్పత్తిలోనూ సమస్య రావచ్చు.బహిరంగ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఇండోర్ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని అనియంత్రిత కాలుష్య సమస్యలు ఉండవు. బహిరంగ వాతావరణంలో సూక్ష్మక్రిముల పోటీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, ఎండ సోకటం వల్ల కొన్ని సహజ వ్యాధికారకాలు నశిస్తాయి. ఇండోర్ వ్యవసాయంలో వ్యాధికారకాలు ఎక్కువ కాలం సమస్యను సృష్టించే వీలుంటుంది. ఇందులో విత్తనాలు, నీరు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, ఎరువులు వంటి ఉత్పాదకాల జీవ భద్రతపై నియంత్రణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.ఇండోర్ వ్యవసాయంలో అధిక తేమ, నీటి ఆధారిత వ్యవస్థలు వాడతాం కాబట్టి సూక్ష్మక్రిములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇండోర్ వ్యవసాయంలో సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ప్రమాదాలు రసాయనాలతో వచ్చే ప్రమాదాల కంటే చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ, పర్యావరణ కాలుష్యం, పొలాస్టిక్ పరికరాల సంబంధిత పదార్థాల నుంచి వెలువడే కాలుష్యం వంటి రసాయన సమస్యలను కూడా నివేదిక పేర్కొంది.ఆర్థిక పోటీకి నిలబడితేనే భవిష్యత్తు‘ఇండోర్ వ్యవసాయం వాతావరణ మార్పుల్ని తట్టుకొని స్థిరమైన దిగుబడినిచ్చే విషయంలో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ సామర్థ్యాన్ని ఆచరణలో నిజం చేయడానికి బలమైన ఆహార భద్రతా పద్ధతులు, పర్యవేక్షణ చాలా అవసరం’ అని ఎఫ్ఏవో నివేదిక రూపుకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆహార భద్రతా అధికారి మసామి టకేచి అన్నారు.‘సాంప్రదాయ పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని వెలువరించగలిగే విషయంలో ఆర్థికంగా పోటీకి నిలవగలగడమే ఇండోర్ వ్యవసాయం విజయానికి కీలకం’ అని డాక్టర్ కీత్ వారినర్ అన్నారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలోని గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయ నిపుణుల్లో కీత్ ఒకరు. ‘అదే సమయంలో, ఇండోర్ పొలాల లోపల నియంత్రిత వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవి లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలి. అప్రమత్తతకు నవీన ఆవిష్కరణలు తోడైతే ఇండోర్ వ్యవసాయం సురక్షితంగా, స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది..’ అని డా. కీత్ వివరించారు.‘ఇండోర్ ఫార్మింగ్’కు పేర్లెన్నో!?ఇండోర్ వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు. ‘రక్షిత వ్యవసాయం‘ అనే పదంతో ‘ఇండోర్ ఫార్మింగ్’ను 13వ శతాబ్దంలో మొదటి సారి వాడారు. బయటి వాతావరణానికి దూరంగా ఉంచే సౌకర్యాల మధ్య పెరిగే మొక్కలనే అర్థంలో వాడారు. ఆ తర్వాత కాలంలో ‘ఇండోర్ వ్యవసాయం‘ అనే పదానికి ‘పట్టణ వ్యవసాయం‘, ‘మొక్కల కర్మాగారం‘, ‘గ్రీన్హౌస్‘, ‘హాట్‌హౌస్‘, ‘గ్లాస్‌హౌస్‘ వంటి అదనపు పదాలు తోడయ్యాయి. ఇవన్నీ పర్యాయపదాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులోని వివిధ పద్ధతులను, వాటి భాగాలను వివరించడానికి ఉపయోగించే పదాలను నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది.పట్టణ వ్యవసాయం: నగరాలు, పట్టణ ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహారాన్ని పండించడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం.ఇండోర్ వ్యవసాయం: ఆరుబయట కాకుండా మూసివున్న వాతావరణంలో పంటలను పెంచే ఏవైనా పద్ధతులు. ఒక గదిలో మొక్కలను పెంచే వ్యవసాయ వ్యవస్థను వివరించేందుకు వాడే పదం.గ్రీన్హౌస్: గ్రీన్హౌస్ అనేది నియంత్రిత పర్యావరణ నిర్మాణం. ఇది ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పరిస్థితులను మారుస్తుంది. మొక్కల పెరుగుదలను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా సహజ వాతావరణ పరిస్థితులు తక్కువ అనుకూలంగా ఉన్న వాతావరణాలలో దీన్ని వాడతారు. గ్లాస్‌హౌస్, పాలీ వినైల్ క్లోరైడ్ గ్రీన్హౌస్, పాలిథిలిన్ గ్రీన్హౌస్ ఇవన్నీ దీనికి పర్యాయపదాలే.చదవండి: ఒక్కసారి నాటు.. ఆరు సార్లు కోతలునియంత్రిత పర్యావరణ వ్యవసాయం: పట్టణ, పట్ణణాల చుట్టూ గలప్రాంతాల్లో ఆరుబయట, మట్టిలో గాని, మట్టిలేకుండా గాని చేసే వ్యవసాయం.మొక్కల కర్మాగారం: కృత్రిమ/సహజ/సౌర కాంతిని ఉపయోగించి అధిక నాణ్యత గల పంటలను నిరంతరం ఉత్పత్తి చేసే భవనం.– పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
బతుకు పూలబాటకాదు
గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది. కరోనా దెబ్బతో విలవిల రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు. కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు రెండున్నర ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్ 23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా -
గ్రీన్హౌస్ సాగుపై మూడు రోజుల శిక్షణ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ సాగుపై రైతులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా మెదక్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి 45 మంది రైతులు పాల్గొన్నారని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో రోజు శిక్షణలో సమీపంలో ఉన్న గ్రీన్హౌస్లను సందర్శించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గ్రీన్హౌస్లో కూరగాయలు, పూల సాగులో మెళకువలు, పాలీహౌస్ నిర్మాణంలో జాగ్రత్తలు, ఎరువుల యాజ మాన్యం వంటి విషయాలను రైతులకు వివరిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో ఉద్యానాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.