
మార్కెట్లో ఎన్నెన్ని కార్లు వచ్చినా.. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో కేవలం పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా.. డీజిల్ హైబ్రిడ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
5. మారుతి డిజైర్
భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటైన మారుతి డిజైర్. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటి. రూ. 6.48 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన డిజైర్.. 25.71 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.
4. మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ కూడా ఎక్కువ మైలేజ్ అందించే కార్ల జాబితాలో ఒకటి. ఇది 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూం).
3. మారుతి సెలెరియో
1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మారుతి సెలెరియో.. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా 26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 69 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూం).
2. హోండా సిటీ ఈ:హెచ్ఈవీ
హోండా కంపెనీకి చెందిన సిటీ ఈ:హెచ్ఈవీ అనేది హైబ్రిడ్ కారు. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర రూ. 19.90 లక్షలు (ఎక్స్ షోరూం).
1. టయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా
టయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా రెండూ కూడా వేరు వేరు కంపెనీ కార్లు అయినప్పటికీ.. ఇవి 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయని సమాచారం. ఈ కార్లు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 92 హార్స్ పవర్, 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.84 లక్షలు, రూ. 8.34 లక్షలు (ఎక్స్ షోరూం).