మారుతి సుజుకి కార్లకు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2025లో ఏకంగా 22.55 లక్షలకు వాహనాలను ఉత్పత్తి చేసింది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి.. 2021లో 16.29 లక్షల యూనిట్లను, 2022లో 19.16 లక్షల యూనిట్లను, 2023లో 19.34 లక్షల యూనిట్లను, 2024లో 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు కంపెనీ గత ఏడాది 22.55 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో మారుతి సుజుకి ఉత్పత్తి 20 లక్షల యూనిట్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండవ సంవత్సరం.
గత ఏడాది కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లను.. మన దేశంలో విక్రయించడానికి మాత్రమే కాకుండా. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఇందులో ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా మొదలైన మోడల్స్ ఉన్నాయి. కాగా మారుతి సుజుకి ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్, ఖార్ఖోడాలలో తయారీ సౌకర్యాలను నిర్వహిస్తోంది.
భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతి చేయడానికి కంపెనీ దేశంలోనే తన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 40 లక్షల యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. ఇదే జరిగితే కార్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


