అయిదేళ్లలో రాంకీ ఇన్‌ఫ్రా లక్ష్యం
ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్‌లపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏటా సుమారు 30 శాతం వృద్ధితో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 2,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం దాదాపు రూ. 10,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ల విలువను రూ. 30,000 కోట్ల స్థాయికి పెంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు నాయర్ వివరించారు.
నీరు–వ్యర్థ జలాలకు సంబంధించిన ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్‌లపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు నాయర్ తెలిపారు. ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్లకు సరిపడా ఆర్డర్ బుక్ ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా 1 బిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై కసరత్తు జరుగుతోందన్నారు. ఆదాయాల్లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) వాటా 45 శాతంగా, బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) వాటా 25 శాతంగా ఉందని నాయర్ చెప్పారు.
కొత్త విభాగాలపై దృష్టి..
ప్రధాన వ్యాపారానికి అనుబంధంగా ఉండేలా డేటా సెంటర్లు, పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనంలాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నాయర్ తెలిపారు. మరోవైపు, డివిడెండు పాలసీ కూడా పరిశీలనలో ఉందని సంస్థ సీఎఫ్‌వో స్రవంత్ రాయపూడి చెప్పారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పూర్తి గా చెల్లించివేసి రుణరహిత సంస్థగా కంపెనీ మారిందని ఆయన వివరించారు. ప్రాజెక్టులు బట్టి స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ)కి సంబంధించి మాత్రమే రుణం తీసుకుంటున్నట్లు స్రవంత్ తెలిపారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ లో గోదావరి జలాలను నింపేందుకు ఉద్దేశించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ నుంచి దక్కించుకున్న రూ. 2,085 కోట్ల భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నాయర్ చెప్పారు.


