సునీల్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్ కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్ శ్రీను తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్ కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మాస్ మహారాజా రవితేజ.
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నెల 13న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ లభించింది. శనివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో సినిమా సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్, నేను మంచి స్నేహితులం. ఓ రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్ కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్ లెవల్’ అన్నారు.


