కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నేడు(నవంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.
మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ(Revolver Rita Movie Story In Telugu).
ఎలా ఉందంటే..
అనుకోకుండా హత్య చేయడం..ఆ శవాన్ని తరలించే ప్రయత్నం..ఈ క్రమంలో ఒక్కో ట్విస్ట్ బయటకు రావడం.. చివరకు ఈ హత్య వెనక కూడా ఓ రహస్యం ఉండడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రివాల్వర్ రీటా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ఓ హత్య చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరినీ విడిచి పెట్టదు.. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనే కోణంలో ఈ మూవీ కథనం సాగుతుంది.
అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ పాయింట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ...తెరపై మాత్రం అది మిస్ అయింది. సినిమా చూస్తున్నంత సేపు దృశ్య 2 మొదలు మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు చాలా చిత్రాలు గుర్తుకువస్తాయి.
కామెడీ అనుకొని రాసిన సన్నివేశాలు కూడా పెద్దగా పేలలేదు. ఉన్నంతలో రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ కాస్త నవ్వులు పంచారు. ఇక ట్విస్టులు అనుకొని రాసిన సన్నివేశాలు కూడా డార్క్ కామెడీ చిత్రాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈజీగా పసిగట్టగలరు.
కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ప్రారంభంలోనే పాండిచ్చేరి డాన్ పాండ్య- నర్సిరెడ్డి మధ్య వైర్యానికి గల కారణం ఏంటో చెప్పి.. కథను కామెడీ జానర్‌లోని మార్చేశాడు. రీటా ఫ్యామిలీ పరిచయ సీన్లతో పాటు..పాండ్య హత్యవరకు అన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. హత్య తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
అయితే ద్వితియార్థంలో వచ్చే చేజింగ్ సీన్లు.. బోరింగ్‌గా సాగుతాయి. ఒకటి రెండు చోట్ల రెడిన్ కింగ్స్లీ వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. అంతేకానీ సునీల్ సీన్లతో పాటు జాన్ విజయన్ సన్నివేశాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఈ తరహా కథలు చాలానే రావడం.. క్రైమ్, కామెడీ సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో.. ‘రివాల్వర్ రీటా’ తూట సరిగా పేలలేకపోయిందనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు.
ఎవరెలా చేశారంటే..
టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్..మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కథలోనే కొత్తదనం లేకపోవడంతో.. ఆమె నటనలోనూ కొత్త కోణం ఏది కనిపించదు. రీటా తల్లి చెల్లమ్మగా నటించిన రాధిక శరత్ కుమార్.. అమాయకత్వపు పనులతో నవ్వులు పూయించింది. సునీల్ పాత్ర లుక్ చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. అది తెరపై కనిపించలేదు. జాన్ విజయన్ కూడా రొటీన్ పోలీసు పాత్రలో కనిపించాడు.
రెడిన్ కింగ్స్లీ ఎప్పటి మాదిరే తనదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. బాత్రూం సీన్ ఒక్కటి బాగా వర్కౌట్ అయింది. సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఓకే. దినేష్ కృష్ణన్. బి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్. కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


