
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడాలన్న పాక్ ఆశలపై మెన్ ఇన్ బ్లూ నీళ్లు జల్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. పెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు సాధించారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని అఘా చెప్పుకొచ్చాడు.
జీర్ణించుకోలేక పోతున్నాం..
"ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాము. మాకు మంచి ఆరంభం లభించినప్పటికి భారీ స్కోర్ సాధించలేకపోయాము. బౌలింగ్‌లో మాత్రం మేము అద్భుతంగా రాణించాము. ఆఖరి వరకు గెలిచేందుకు అన్ని విధాలగా మేము ప్రయత్నించాము.
బ్యాటింగ్‌లో మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది. స్ట్రయిక్‌ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే మేము అనుకున్న స్కోర్ చేయలేకపోయాము. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము.
మా బ్యాటింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటాము. భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లలో భారత విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మాకు గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావించాను.
కానీ దురదృష్టవశాత్తూ ఓటమి చవి చూశాము. అయితే మా బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి సవాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.
మేము బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం మాకు ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌ను భారత్ బహిష్కరిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది.
చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్