అసియాకప్ టైటిల్‌ను తొమ్మిదోసారి ముద్దాడాలనుకున్న భారత అండర్-19 జట్టుకు నిరాశే ఎదురైంది. అండర్-19 ఆసియాకప్ 2025 టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తుది మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది.
గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై అలవోక విజయం సాధించిన యంగ్ ఇండియా... ఫైనల్లో అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు ఉస్మాన్ ఖాన్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు.
బౌలర్లలో దీపేశ్ మూడు వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.
పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు తీశారు. సమీర్ మన్హాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఓటమిపై భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే స్పందించాడు. పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని, ఈ మ్యాచ్‌లో తమకు ఏది కలిసిరాలేదని అతడు చెప్పుకొచ్చాడు.
"టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. కానీ మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. మాకు ఏది కలిసిరాలేదు. ఫీల్డింగ్‌లో మాకు ఇది బ్యాడ్ డే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ప్రత్యర్ధి జట్టు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కూడా బాగా చేశారు. మా బౌలర్లను సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు.
వారు తమ ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాము. కానీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాము. అయితే ఓటమి ఎదురైనప్పటికి మా జట్టుకు చాలా సానుకూల అంశాలు లభించాయి. టోర్నీ అసాంతం మా బాయ్స్ బాగా ఆడారు. ఈ టోర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము" అని మాత్రే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


