
ఎవరెస్టు శిఖరం అధిరోహించడం అనేది ఔత్సాహిక పర్వతారోహకులకు అపురూపమైన కల. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందదో ఉన్నారు కూడా. అయినా ఆ పర్వతాన్ని అధిరోహించాలనే క్రేజ్ మాత్రం తగ్గదు పర్వతారోహకులకు. పైగా అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండే ఎముకల కొరికే చలి వంటి పరిస్థితులన్నింటినీ ఓర్చుకుంటూ అధిరోహించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే అధిరోహించాడు ఈ 37 ఏళ్ల వ్యక్తి. పైగా అక్కడ స్కీయింగా కూడా చేయడం మరింత విశేషం.
అతడే పోలాండ్ దేశానికి చెందిన ఆండ్రెజ్ బార్గియల్. గతంలో అతడికి రెండు మూడుసార్లు ఇదే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా వెరవక మూడో ప్రయంత్నంలో దాదాపు 8,849 మీటర్లు (29,032 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్ సపోర్టు కూడా లేకుండా విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు.
శరదృతువులో మరింత క్లిష్టతరం ఉండే సమయంలో ఈ పర్వతాన్ని అధిరోహించి అందర్ని ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఈ మేరకు బార్గియల్ మాట్లాడుతూ.. ఈ సాహసాన్ని తన క్రీడా జీవితంలో అత్యంత ముఖ్యమైన మెలురాయిగా అభివర్ణించాడు. ఈ శిఖరాన్ని అధిరోహించే మార్గం ఎంత క్లిష్టతరమైందో కూడా వివరించాడు.
ఏదేమైతేనేం..చివరికి అధిరోహించడమే గాక అంత ఎత్తులో చాలాసేపు గడిపాడు. పైగా అక్కడే స్కీయింగ్ చేయాలన్నది తన డ్రీమ్ అని, అది అనుకోకుండా ఇవాళ సాకారమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే తాను కష్టతరమైన శరదృతువులో ఖంబు హిమనీనదం ద్వారా అవరోహణ రేఖ నుంచి అధిరోహించే ప్లాన్ చేయడమనేది ఎంత పెద్ద సవాలో కూడా తనకు తెలసునని చెప్పుకొచ్చాడు బార్గియల్
ఎలా సాగిందంటే..
ఆయన ఈ ఎవరెస్టు శిఖరాన్ని సెప్టెంబర్ 19న నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభించారు. అలా మొత్తం క్యాంప్‌లు I, II, III గుండా ఎక్కినట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్ 21న క్యాంప్ IV నుంచి పర్వతం డెత్‌జోన్‌కి చేరుకున్నానని, ఇది సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల మీటర్లు పైనే ఉంటుందని అన్నారు. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయన్నారు. అక్కడ నుంచి సుమారు 16 గంటల అధిరోహణ అనంతరం సెప్టెంబర్ 22కి శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఎవరెస్టు శిఖరం అత్యంత ప్రమాదకరమైన విభాగాలలో ఒకటిగా పేర్కొనే ఖంబు ఐస్‌ఫాల్ గుండా స్కీయింగ్ చేసి బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. అక్కడ అతనికి తన సోదరడు బార్టెక్ ఎగరువేసిన డ్రోన్ మార్గనిర్దేశం చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజంగా అత్యంత ఎత్తైన పర్వతంగా పిలిచే ఈ ఎవరెస్టుని అధిరోహించడమే గ్రేట్ అంటే బార్గియల్ ఆక్సిజన్ బాటిల్ లేకుండా అధిరోహించడమే కాకుండా స్కీయింగ్ కూడా చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు.
(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..)