
సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా ఘటన
గౌహతి: ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్(52) కన్నుమూశారు. సింగపూర్‌లో శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు సహచరులు సీపీయూ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ జుబీన్ తుదిశ్వాస విడిచినట్లు నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కానూ మహంత వెల్లడించారు.
‘యా అలీ’గా ప్రసిద్ధుడైన జుబీన్ గార్గ్ ఈ వేడుకలో పాల్గొనడం కోసమే బుధవారం ఇండియా నుంచి సింగపూర్ చేరుకున్నారు. స్థానికంగా స్థిరపడిన అస్సాం ప్రజలతో కలిసి స్కూబా డైవింగ్ కోసం పడవలో బయలుదేరారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
శుక్రవారం ప్రారంభమైన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మూడు రోజులపాటు జరగాల్సి ఉండగా, జుబీన్ గార్గ్ మృతి నేపథ్యంలో ఈ వేడుకలు రద్దు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. జుబీన్ గార్గ్‌కు భార్య ఉన్నారు. ఆయన 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించడం గమనార్హం. అస్సామీ భాషలో తన పాటలతో అలరించారు.
అనామిక, మోనోర్ నిజానోత్, మాయ, ఆశా, ముజాలిర్ ఎజోనీ సువాలీ తదితర అల్బమ్‌లు విడుదల చేశారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.
గదర్, దిల్ సే, డోలీ సజా కే రఖ్నా, ఫిజా, కాంటే, జిందగీ తదితర హిందీ చిత్రాల్లో ఆయన తన గళం వినిపించారు. అస్సాం సంస్కృతికి ప్రతీకగా నిలిచారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పలు సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగస్వామి అయ్యారు. కళాగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకున్నారు.
గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగంలో ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్లాఘించారు. జుబీన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. జుబీన్ మృతికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు సంతాపం ప్రకటించారు.