అయోధ్య: రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67)సోమవారం గుండెపోటుకు గురై కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని రేవాలోని ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం విషపూరితం కావడంతో కిడ్నీలు ఫెయిలయ్యాయని, ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు.
వెంటిలేటర్ అమర్చిన కొద్ది గంటల్లోనే సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్నారు. వేదాంతి అంత్యక్రియలను అయోధ్యలో నిర్వహిస్తామని ఆయన శిష్యుడు చోటె దాస్ మహారాజ్ చెప్పారు. ఈ నెల 10వ తేదీన రేవాలో జరిగే ఆధాత్మిక కార్యక్రమం కోసం వేదాంతి అయోధ్య నుంచి వెళ్లారని, అక్కడే అనారోగ్యానికి గురయ్యారని అయోధ్య మేయర్ గిరీశ్‌పతి త్రిపాఠీ చెప్పారు.
1958లో రేవాలో జన్మించిన వేదాంతి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఈయన అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గఢి మహంత్ అభిరామ్ దాస్ శిష్యుడు. 1949లో బాబ్రీ మసీదులో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించింది అభిరామ్ దాసేనని ఆయన శిష్యులు చెప్పారు. వేదాంతి అయోధ్యలో వశిష్ట భవన్ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు.


