మరో ఎనిమిది మంది కమిషనర్లు కూడా
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయెల్ మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకంతో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తి సామర్థ్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ సారథ్యంలో హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ గత వారం వీరిని ఎంపిక చేసి, రాష్ట్రపతికి సిఫారసు చేయడం తెల్సిందే. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్ కుమార్ గోయెల్ తదితరులతో ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ పాల్గొన్నారు. సీఐసీ సారథ్యంలోని ఈ కమిషన్‌లో గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లకు గాను ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లు మాత్రమే పని చేస్తున్నారు. తాజా నియామకాలతో దాదాపు తొమ్మిదేళ్లకు సీఐసీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. సోమవారం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జయ వర్మ సిన్హా, స్వాగత్ దాస్, సంజీవ్ కుమార్ జిందాల్, సురేంద్ర సింగ్ మీనా, కుష్వంత్ సింగ్ సేథి, పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, సుధారాణి రేలంగి ఉన్నారు.


