Bhool Chuk Maaf Review: తెల్లారితే పెళ్లి.. కానీ రోజు మారదు.. ఇదేం ట్విస్ట్‌! | Bhool Chuk Maaf Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Bhool Chuk Maaf Review: నేడన్నది పోదు...రేపన్నది రాదు..ఎలా?

Jun 14 2025 3:59 PM | Updated on Jun 14 2025 5:52 PM

Bhool Chuk Maaf Movie Review In Telugu

ఈ రోజుల్లో తాము చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలామంది భయం లేకుండానే తప్పులు చేస్తుంటారు. మరి తప్పు చేసినవాడికి తన తప్పు తెలుసుకోవడానికి చిన్న పాటి భయం కలిగిస్తే అన్న ఆలోచనతోనే రూపుదిద్దుకున్న సినిమా భూల్ చుక్ మాఫ్. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ధమాన బాలివుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు హీరోగా నటించారు. ఈ సినిమా కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతే సరదాగా సినిమా అంతా సాగిపోతుంది కూడా.

అంతలా కథలో ఏముందంటే... వారణాసి నగరానికి చెందిన తితిలి మిశ్ర, రంజన్ తివారి ప్రేమించుకుంటుంటారు. తితిలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి తమ కూతురుని రంజన్ పెళ్ళాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పని సరి అని కండిషన్ పెడతారు. ఇది విన్న రంజన్ హమీద్ అంసారీ అనే బ్రోకర్ ద్వారా దొంగ దారిలో  గవర్నమెంట్ ఉద్యోగం త్వరగానే సంపాదిస్తాడు. ఇంకేముంది ఇరు కుటుంబాలు కలిసి ఇద్దరికీ పెళ్ళి చేయాలని ఓ తేదీని నిర్ణయిస్తాయి. రేపు పెళ్ళి అనగా ఈ రోజు నిద్ర లేచి నలుగు కార్యక్రమానికి రెడీ అవుతుంటాడు రంజన్. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి రేపటి తన పెళ్ళి గురించి కలలు కంటూ మరుసటి రోజు నిద్ర లేస్తాడు.

కాని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నలుగు కార్యక్రమం రోజే రంజన్ నిద్ర లేస్తాడు. ఇలా ఎన్ని రోజులైనా అదే రోజు నిద్ర లేస్తూ ఉంటాడు. రంజన్ టైం లూప్ లో ఇరుక్కుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది.  ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి చక్కగా పెళ్ళి చేసుకుందామన్న సమయంలో ఈ సమస్య రంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి రంజన్ ఈ టైం లూప్ నుండి బయటపడి పెళ్ళి చేసుకోగలుగుతాడా, అసలు ఇలాంటి సమస్య రంజన్ కు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న భూల్ చుక్ మాఫ్ చూడాల్సిందే. 

ఈ సినిమా కథలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కామెడీతో దానిని ప్రేక్షకుడికి చక్కగా అర్ధమయ్యేలా తీశాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం నవ్వులతో గిలిగింతలు పెడుతూ హాయిగా సాగుతుంది. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.

Advertisement
 
Advertisement
Advertisement