కూతురంటే ఆ తండ్రికి ఎనలేని మమకారం. తండ్రంటే ఆ కూతురికి చెప్పలేనంత ప్రేమ. కూతురిపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘ఏ నాటి వరమో..’ అంటూ పాట అందుకున్నారు తండ్రి. రష్మికా మందన్నా టైటిల్ రోల్‌లో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించిన∙‘మైసా’ చిత్రంలోని పాట ఇది. రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో సముద్ర ఖని, ఈశ్వరీ రావు నటించారు.
ఈ చిత్రంలోని తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే ‘ఏ నాటి వరమో...’ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి పాడారు. ‘‘ఈ పాట మైసా చిన్నప్పటి రోజులను చూపిస్తుంది. తండ్రిపై తనకున్న ప్రేమకు గుర్తుగా వేయించుకున్న టాటూని మైసా చూసుకోవడం ఈ పాటలో ఓ స్పెషల్ మూమెంట్’’ అని యూనిట్ పేర్కొంది. ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


